‘లడ్కీ బహిన్’లో భారీ కోత : మహారాష్ట్ర‌లో 92 లక్షల మంది మహిళల తొలగింపు

by I. Sairam |

మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న అమలు చేస్తున్న ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారుల్లో 92 లక్షల మంది అనర్హులుగా తేలారు.

‘లడ్కీ బహిన్’లో భారీ కోత : మహారాష్ట్ర‌లో 92 లక్షల మంది మహిళల తొలగింపు
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్న సామాజిక భద్రతా పథకం ‘ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ యోజన’ లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పడింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భారీ డిజిటల్ వెరిఫికేషన్, ఆడిట్ ప్రక్రియల అనంతరం లబ్ధిదారుల జాబితా నుండి దాదాపు 92 లక్షల మంది మహిళలను తొలగించింది. ఈ అనూహ్య చర్య వల్ల పథకం పరిధిలో ఉన్న మహిళల సంఖ్య 2.6 కోట్ల నుంచి 1.53 కోట్లకు పడిపోయింది. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం, వారి ఆరోగ్యం, పోషకాహారాన్ని తీసుకొనే స్థాయిని మెరుగుపర్చడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద ప్రతీ నెల అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఇది నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతుంది. అయితే తాజా కోత వల్ల లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సాయం నిలిచిపోనుంది. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో అత్యధికంగా లబ్ధిదారులను తొలగించారు. ఇక్కడ నిర్వహించిన అడిట్‌లో ఏకంగా 2.83 లక్షల మంది మహిళలు అనర్హులుగా గుర్తించారు. కాగా.. గడువులోగా ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయకపోవడం, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే అధికంగా ఉండటం, చాలా కుటుంబాలు ఆదాయపు పన్ను చెల్లించడం, కొందరి ఇంట్లో ఫోర్ వీలర్లు ఉండటమే భారీ స్థాయిలో లబ్ధిదారుల తొలగింపునకు కారణం అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ పథకంలో అక్రమంగా నమోదు చేసుకొని లబ్దిపొందుతున్న 12,000 మంది కంటే ఎక్కువ మంది పురుషులను కూడా అధికారులు తొలగించారు.

Next Story