అదనపు లోడ్ పెరిగితేనే డెవలప్ మెంట్ చార్జీలు

by  |
NPDCL CMD Gopal Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ వినియోగదారులు అదనపు లోడ్ పెరిగినందుకు మాత్రమే డెవలప్ మెంట్ చార్జీలు చెల్లించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చార్జీలు ప్రతినెలా రావని, కేవలం ఒక్కసారి మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యుత్ బిల్లుల కేంద్రాలు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే పనిచేస్తుండటంతో కార్యాలయాలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఆన్‌లైన్‌లో సులువుగా చెల్లించొచ్చని ఆయన సూచించారు. టీఎస్ ఎన్పీడీసీఎల్, పేటీఎం, టీ వాలెట్, ఫోన్ పే యాప్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని గోపాల్ రావు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా కరోనా కారణంగా స్పాట్ బిల్లర్లు రీడింగ్ తీసేందుకు రాకుంటే ఒకటి రెండ్రోజులు చూసి వినియోగదారులే విద్యుత్ రీడింగ్ తీసుకోవాలని సూచించారు. ఇందుకు వినియోగదారులు ఆండ్రాయిడ్ ఫోన్‌లో ప్లే స్టోర్ నుంచి ‘టీఎస్ ఎన్పీడీసీఎల్ ఐటీ వింగ్’ యాప్ లేదా ‘భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్‘ యాప్‌ను ఇన్ స్టాల్ చేయాలన్నారు. యాప్ ఓపెన్ చేసి ‘సెల్ఫ్ రీడింగ్’ను క్లిక్ చేసి ‘సబ్మిట్ సెల్ఫ్ రీడింగ్’ను ఎంచుకోవాలని సూచించారు. అనంతరం ‘యూనిక్ సర్వీస్ నంబర్’ ఎంటర్ చేసి, ‘మొబైల్ నంబర్’ అందజేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు అన్నారు. అనంతరం ‘కే.డబ్ల్యూ‌.హెచ్’ను క్లిక్ చేసి ‘కే.డబ్ల్యూ.హెచ్’ రీడింగ్ స్కాన్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలని తెలిపారు. అప్పుడు ఆ బిల్లు వివరాలు వినియోగదారుడి మొబైల్‌కు మెసేజ్ రూపంలో వస్తాయని తెలిపారు. అనంతరం బిల్లు చెల్లింపులు కూడా ఆన్ లైన్‌లోనే చేయొచ్చన్నారు. సెల్ఫ్ మీటర్ రీడింగ్ పద్ధతి కేవలం ఈ ఒక్క నెలలో మాత్రమే వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.


Next Story

Most Viewed