స్లాట్‌ బుకింగ్‌ నిల్.. కారణమిదే!

by  |
స్లాట్‌ బుకింగ్‌ నిల్.. కారణమిదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో : మూడు నెలల తర్వాత రిజిస్ర్టేషన్ ప్రక్రియ మొదలైనా.. అది ఇంకా గాడిన పడటం లేదు. మూడు రోజుల నుంచి ఒక్క స్లాట్​బుక్​కానీ సబ్​రిజిస్ట్రార్ కార్యాలయాలు చాలానే ఉన్నాయి. అవి సైతం రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్​జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. దానికి కారణం రిజిస్ట్రేషన్ల విధానంపై రియల్టర్లకు, వినియోగదారులకు అవగాహన లేకపోవడం ఒక కారణం అని తెలుస్తోంది.

దానికి తోడు ప్రతి ఓపెన్ ప్లాట్‌కు టిపిన్ నంబర్ అడుగుతుండటంతో సమస్య ఎదురవుతుంది. ఆ పిన్ పొందాలంటే అన్ని అనుమతులు ఉన్న లేఅవుట్లలోని ప్లాటు, లేదంటే ఎల్‌ఆర్ఎస్ పొందిన స్థలమై ఉండాలి. ఎల్ఆర్ఎస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే 29 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటినీ పరిష్కరిస్తే తప్పా కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లు జరిగే పరిస్థితి లేదని రంగారెడ్డి జిల్లాలోని ఓ సీనియర్ సబ్ రిజిస్ట్రార్ అభిప్రాయపడ్డారు.

మూడు నెలల తర్వాత రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో ఇప్పుడైనా క్రయ విక్రయాలకు ప్రజలు వస్తారని ఆశించిన ఎస్ఆర్వోలకు నిరాశే మిగిలింది. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహింపట్నం, గండిపేట, వనస్థలిపురం, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, షాద్‌నగర్, ఉప్పల్, కీసర, శామీర్‌పేట.. తదితర సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పది శాతం లావాదేవీలు సైతం జరగడం లేదు. శంకర్‌పల్లి వంటి తీరిక లేకుండా ఉండే ఎస్‌ఆర్ఓ ఆఫీసుల్లోనూ మూడు రోజుల్లో ఒక్కటంటే ఒక్క రిజిస్ట్రేషన్ సైతం కాలేదు.

ఇది ఇలాగే కొనసాగితే కష్టమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌ఆర్ఎస్​దరఖాస్తులను పరిష్కరిస్తే తప్ప వినియోగదారులు ముందుకు రాలేరని స్పష్టం చేస్తున్నారు. పంచాయత్‌రాజ్, పురపాలక శాఖలేవీ ఇప్పటి వరకు ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులను పట్టించుకోలేదు. కనీసం ఎవరికీ నోటీసులు జారీ చేయలేదు. పైగా సిబ్బందిలేమితో ఇబ్బంది పడుతున్న శాఖల ద్వారా ప్లాట్ల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుడితే కనీసం 6 నెలలైనా సమయం పడుతుందని అధికారులే చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మరో 6 నెలల వరకు రిజిస్ట్రేషన్ల శాఖకు పూర్వ వైభవం అవకాశం లేదని తెలుస్తోంది.


Next Story

Most Viewed