తప్పులు ఉన్న హ్యారీ పోట్టర్ పుస్తకానికి ఇంత ధర?

37

దిశ, వెబ్‌డెస్క్: హ్యారీ పోట్టర్ పుస్తకాలు, సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పుస్తకాల సిరీస్ ముగిసి దశాబ్దాలు దాటుతున్నా వాటికి ఉన్న పాపులారిటీ తగ్గలేదు. ఆ పుస్తకాలకు మాత్రమే కాదు, ఆ కథల్లో ఉపయోగించిన వస్తువులు, ఇంకా ఇతర మర్చండైజ్‌ను కూడా ఎగబడి కొనేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అయితే, ఇటీవల ఆ సిరీస్‌కు సంబంధించిన మొదటి పుస్తకానికి సంబంధించిన వేలంలో ఆ పుస్తకం రూ. 71 లక్షలు పలికింది. అదేంటీ పుస్తకాలు దొరుకుతున్నాయి కదా..అందులో అంత ప్రత్యేకంగా ఏముందని మీరు అనుకోవచ్చు. ప్రత్యేకత ఉంది కాబట్టే దీనికి అంత ధర పలికింది. అయితే, వేలంలో వారు చెప్పిన దానికి రెట్టింపు ధర వస్తుందని మాత్రం ఆ వేలం నిర్వహించిన హాన్సన్స్ ఆక్షన్‌ వారు కూడా ఊహించలేకపోయారు. ఇంతకీ ఆ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే..

అసలైన కాపీని పబ్లిష్ చేయడానికి ముందు ప్రూఫ్ రీడింగ్ చేసే క్రమంలో కొన్ని పుస్తకాలు విడుదలకు నోచుకోకుండానే నిలిచిపోతాయి. అలాగే హ్యారీ పోట్టర్ మొదటి పుస్తకమైన ఫిలాసఫర్స్ స్టోన్ పుస్తకాన్ని మొదటగా 500 కాపీలు ప్రింట్ చేసి, వాటిలో 300 కాపీలను స్కూల్ విద్యార్థులకు, లైబ్రరీలకు పంపించారు. ఆ మిగిలిన రెండు వందల కాపీలకు చెందిన పుస్తకమే ఇది. ఆ పుస్తకంలో ఉన్న తప్పుల ఆధారంగా ఇది ఆ 200 కాపీల్లో ఒకటేనని పుస్తక నిపుణులు జిమ్ స్పెన్సర్ కనుక్కున్నాడు. ప్రస్తుతం ఈ పుస్తకం పైకి చూడటానికి పాతగా ఉన్న లోపల కంటెంట్‌ ఏమీ దెబ్బతినలేదని ప్రకటిస్తూ హాన్సన్స్ సంస్థ వేలం వేసింది. అలాగే ఈ పుస్తకం ఇష్యూ నెంబర్ కూడా 10 నుంచి 1 వరకు వరుసగా అంకెలు ఉండటం విశేషం.