సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ‘నోముల’..?

by  |
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ‘నోముల’..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా.. పార్టీల అభ్యర్థిత్వం ఖరారు విషయమే తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. నామినేషన్‌కు ఒక్క రోజే గడువు ఉన్నా.. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీలు ఇంకా ఉపఎన్నిక అభ్యర్థులను అధికారికంగా ఖరారు చేయలేదు. అయితే తాజాగా టీఆర్ఎస్ పార్టీ తరపున ఉపఎన్నికలో ఎవరు పోటీ చేయనున్నారనే అంశంపై క్లారిటీ వచ్చింది. సాగర్ బరిలో ఉపఎన్నిక అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌కు టికెట్ ఖరారయ్యింది.

అయితే అభ్యర్థిత్వం విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నాం 2 గంటలకు పార్టీ అధిష్టానం బీ ఫామ్‌ను అందించనున్నట్టు సమాచారం. దీంతో మంగళవారం నోముల భగత్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. అయితే టికెట్ ఆశించిన ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్, గురువయ్యయాదవ్, రంజిత్ యాదవ్ తదితరులంతా ఇప్పుడేం చేయనున్నారనే దానిపై అంతా ఆసక్తి నెలకొంది. నోముల కుటుంబానికి సహకరిస్తారా.. లేదా హ్యాండిస్తారా..? అనే దానిపై రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.

ఇప్పటికే ప్రచారమంతా పూర్తి..

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్ పక్కా వ్యూహాంతో ముందుకు సాగుతోంది. చివరి నిమిషం వరకు అభ్యర్థి ఎవరనేది తేల్చకుండానే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారాన్ని కంప్లీట్ చేసింది. అందుకు సంబంధించి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి, మున్సిపాలిటీకి ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జులుగా నియమించింది. అభ్యర్థి ఎవరనేది పక్కనబెట్టి.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధినే ప్రధాన అస్త్రాలుగా ప్రచారం సాగింది. దీంతో అభ్యర్థి ఎవరైనా ప్రజల్లో సానుకూలతను సృష్టించారు.

దీనికితోడు నోముల కుటుంబానికే టికెట్ ప్రకటించనున్న నేపథ్యంలో దివంగత ఎమ్మెల్యే నర్సింహాయ్య సానుభూతి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి టీఆర్ఎస్‌లో వర్గపోరు ఎక్కువకావడం.. నాన్ లోకల్, లోకల్ ఇష్యూ తెరపైకి రావడంతో అసలు నోముల కుటుంబానికి టికెట్ దక్కుతుందా అన్న ప్రశ్నలు తలెత్తాయి. టీఆర్ఎస్ అధిష్టానం సైతం నోముల కుటుంబం కాకుండా లోకల్ క్యాండిడేట్‌ను పెట్టాలనే భావనకు వచ్చింది. కానీ దుబ్బాక ఉపఎన్నికలో సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ కేటాయించినప్పుడు.. సాగర్‌లోనూ నోముల కుటుంబానికే టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా విన్పించింది. దీంతో అంతిమంగా పార్టీ అధిష్టానం నోముల కుటుంబానికే టికెట్ కేటాయించినట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed