ఉంటే ఉండండి… లేకుంటే వెళ్లిపోండి.. ఆర్టీసీ కార్మికులకు వేతన గండం

138

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్టీసీ కార్మికులను ఆర్థిక కష్టాల్లోకి నెట్టుతున్నారు. వేతనాలు కూడా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. సగం నెల దాటినా ఇంకా జీతాలు చేతికందలేదు. జీతం ఇవ్వాలని అడిగితే.. ఉంటే ఉండండి.. లేకుంటే వీఆర్​ఎస్​ తీసుకోండి అంటూ నిర్లక్ష్య సమాధానాలు చెప్పుతున్నారు. ఇచ్చినప్పుడే తీసుకోవాలంటూ తెగేసి చెప్పుతున్నారు. అసలు ఎప్పుడు వేతనాలు ఇస్తారనే క్లారిటీ లేకుండా పోయింది. మరోవైపు ఆర్టీసీ కొత్త ఎండీ సజ్జనార్​ హడావుడి తనిఖీలకే పరిమితమవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లను హడావుడి పెడుతున్నా.. వేతనాలపై మాత్రం నోరెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జీతం రాలే

ఆర్టీసీ కార్మికులకు ఈ నెల వేతనాలు ఇంకా అందలేదు. ప్రతినెలా కనీసం 15వ తేదీ వరకు వేతనాలు విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు మరింత ఆలస్యమవుతున్నాయి. గురువారం రాత్రి వరకు కూడా కార్మికులకు జీతం జమ కాలేదు. కొన్ని డిపోల్లో వేతనం కోసం అడిగితే హెచ్చరికలే సమాధానమవుతున్నాయి. అసలు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆర్టీసీలో ఇప్పటికే సిబ్బందిని తరలించుకునే ప్రక్రియను మొదలుపెడుతున్నారు. వీఆర్​ఎస్​ వైపు కార్మికులను మళ్లించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు వేతనాలు సకాలంలో ఇవ్వకుండా మరింత ఆర్థిక కష్టాల్లోకి నెడుతున్నట్లు కార్మికులు పేర్కొంటున్నారు. ప్రతినెలా ఇలా వేతనాలను ఆలస్యంగా ఇస్తే సొంతంగా వెళ్లిపోయేందుకు నిర్ణయం తీసుకుంటారనే ప్లాన్​లో ఆర్టీసీ యాజమాన్యం ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

హడావుడికే కొత్త ఎండీ

ఆర్టీసీ ఎండీగా ఈ నెల 3న ఐపీఎస్​ అధికారి సజ్జనార్​ విధుల్లోకి చేరారు. అప్పుడే కార్మికుల వేతనాలపై ప్రకటన చేశారు. ప్రతినెలా 1వ తారీఖునాడే వేతనాలిస్తామంటూ ప్రకటించారు. కానీ తొలి నెలలోనే జీతాలు ఆలస్యమవుతున్నాయి. అయితే ఇటీవల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం, బస్టాండ్లను పరిశీలించడం వంటి కార్యక్రమాలతో సజ్జనార్​ హడావుడి చేస్తున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి అదే పర్యటనలో ఉంటున్నారు. కానీ వేతనాల విషయంలో మాత్రం ముందడుగు వేయడం లేదు. కనీసం ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని కూడా చెప్పడం లేదు. దీంతో హడావుడి సరే.. వేతనాలు ఏవీ అంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

సర్దుబాటుపై సందిగ్థం

మరోవైపు జీతాల కంటే ఎక్కవగానే నిధులున్నా వాటిని వాడుకోవడంలో ఆర్టీసీ యాజమాన్యం ఎటూ తేల్చలేకపోతోంది. వచ్చిన ఆదాయాన్ని కూడా వేతనాల కోసం సర్దుబాటు చేసే అధికారం తమకు లేదంటూ చేతులెత్తేస్తోంది. వాస్తవానికి ఆర్టీసీ ఆదాయం ఇటీవల పెరిగింది. దాదాపు రూ. 400 కోట్ల రాబడికి చేరింది. అటు బ్యాంకు నుంచి ఇచ్చిన అప్పు కూడా ఆర్టీసీ ఖాతాల్లో భద్రంగా ఉంది. అయినప్పటికీ జీతాలకు రూ. 120కోట్లను వాడుకునేందుకు సాహసించడం లేదు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..