కొత్త పంచాయతీలకు బిల్డింగుల్లేవ్.. శిథిలావస్థకు!

by  |
కొత్త పంచాయతీలకు బిల్డింగుల్లేవ్.. శిథిలావస్థకు!
X

‘ప్రజల దరికి పాలన.. అభివృద్ధికి నోచుకోని తండాలు, గూడేలను పంచాయతీలుగా మారుస్తాం. ప్రభుత్వం కేటాయించే నిధులతో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవచ్చు’ ఇది గ్రామపంచాతీల ఏర్పాటు సందర్భంగా సీఎం కేసీఆర్​చెప్పిన మాటలు. పార్టీ అధినేత మాటలకు అనుచరగణం వంతపాడింది. గ్రామ పంచాయతీల ఏర్పాటుతో గ్రామాల రూపురేఖలు మారుతాయని, ప్రగతి పథంలో పల్లెలు పయనిస్తాయని ఊదరగొట్టారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. నూతన పంచాయతీలు ఏర్పడి రెండేళ్లు పూర్తయినా కనీస వసతులకు నోచుకోని గ్రామాలు రంగారెడ్డి, వికారాబాద్​జిల్లాల్లో అనేకం ఉన్నాయి. పంచాయతీ భవనాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న భవనాలు సైతం శిథిలావస్థకు చేరడం, నూతన భవనా ఏర్పాటుకు నిధుల మంజూరులో తీవ్ర జాప్యం జరగడంతో పక్కా భవనాలు కలగానే మారాయి.

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో 56‌0, వికారాబాద్ జిల్లాలో 566 గ్రామాలున్నాయి. వీటిలో పంచాయతీలకు సొంత భవనాలు 50శాతం లోపే ఉన్నాయని ఆయా జిల్లాల అధికారులు స్పష్టం చేశారు. సొంత భవనాలున్న పంచాయతీల్లో పాలనకు ఇబ్బందులు లేకపోయినా, మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరిన జీపీ భవనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటైన పంచాయతీలను స్కూళ్లలోని అదనపు గదులు, అంగన్​వాడీ కేంద్రాలు, సమైక్య భవనాలు, యువజన సంఘాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రైవేట్ భవనాలు, అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. దీంతో సరియైన వసతులు లేక పాలకవర్గ సభ్యులు, తమ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ జిల్లాలోని పంచాయతీల పరిస్థితి..

గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పే గొప్ప మాట. కానీ, ఆ మాటలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టమవుతోంది. రంగారెడ్డి జిల్లాలో 560 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 369 గ్రామ పంచాయతీలకు అదనంగా మరో 191 కొత్తగా పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పాత గ్రామ పంచాయతీల్లో 18 గ్రామాలకు సొంత భవనాలే లేవు. మిగిలిన 351 గ్రామ పంచాయతీల్లో 253 పంచాయతీ భవనాలు బాగున్నాయి. 69 భవనాలు శిథిలావస్థల్లో ఉన్నాయి. నిధులు లేకపోవడంతో ఈ భవనాలు మరమ్మతులకు నోచుకోలేదు. వికారాబాద్‌ జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 325 పంచాయతీలకు సొంత భవనాలు ఉన్నాయి. సొంత భవనాలు కలిగిన పంచాయతీల్లో 172 భవనాలు మాత్రమే బాగుండగా, 120 పంచాయతీల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వీటిలో 85 భవనాలకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని అధికారులే వివరిస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన 198 పంచాయతీ భవనాల్లో కొన్నిచోట్ల నిర్మాణ పనులు కొనసాగుతూ నిధులు లేక నిలిచిపోయాయి.

నిధులు కేటాయింపుతో వదిలేశారు..

రాష్ట్ర ప్రభుత్వం ఏ పంచాయతీకి ఎన్ని నిధులు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. కానీ, ఆ నిర్ణయం అమలులో జాప్యం జరుగుతోంది. పక్కా భవనాలు లేకపోవడంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడుతున్నారు. పక్కా భవనాలు లేని పంచాయతీలకు మూడు విడతల్లో భవనాలు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. వేయి లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 లక్షలు, రెండు వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలకు రూ.15లక్షలు, ఆపై జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20లక్షలు భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నిధుల మంజూరులో ఆలస్యం కావడంతో పంచాయతీలకు సొంత భవన నిర్మాణాలు కలగానే మారాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed