ఆ పోలీస్ స్టేషన్‌కు వచ్చినొళ్లు వచ్చినట్లే పోతున్నరు.. సీఐ నుంచి ఎస్సైల దాకా..!

by  |
police officers
X

దిశ, నిజామాబాద్ రూరల్ : నిజామాబాద్ రూరల్‌ నియోజకవర్గంలోని సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, జక్రాన్పల్లి, డిచ్పల్లి, నిజామాబాద్ రూరల్ మండలాలకు చెందిన స్థానిక పోలీస్ పోలీస్‌స్టేషన్‌లోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్‌ఇన్ స్పెక్టర్లు విధుల పట్ల కనబరుస్తున్న నిర్లక్షమైన ధోరణి వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రజలకు న్యాయం అందించాల్సిన వీరు నాయకులకు కొమ్ముకాస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే రూరల్ నియోజకవర్గంలో గత ఏడాది వ్యవధిలోనే ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు బదిలీకావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారం కావడం లేదని సమాచారం.

ఇటీవల కాలంలో నిజామాబాద్ రూరల్ పరిధిలోని పీఎస్ నుంచి బదిలీపై వెళ్లిన అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. డిచ్పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లును జిల్లా సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అనంతరం దర్పల్లి మండల ప్రసాద్‌ను బదిలీ చేస్తూ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ అప్పట్లోనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. డిచ్‌పల్లి ఎస్సై సురేష్‌ను ఆగమేఘాల మీద బదిలీ చేస్తూ జిల్లా కేంద్రంలోని సీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. రూరల్ మండల ఎస్సైను కేసులు పెండింగ్‌లో పెడుతున్నాడని చెప్పి బదిలీ చేశారు. దర్పల్లి మండల ఎస్సై పాండే రావు వసూల్ రాజాగా మారి గ్రామాల్లో ఇసుక మాఫియా, పంచాయితీలు, ఏదైనా కేసులో ఎవరు ఎక్కువగా డబ్లులిస్తే వారిపైపు మొగ్గడం వంటి విషయాలపై దుబ్బాక, దర్పల్లి గ్రామస్తులు ఆరోపించడంతో ఎస్సై పాండే రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి, సీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. గత నాలుగు రోజుల కిందట ఇందల్వాయి ఎస్సై శివప్రసాద్ రెడ్డి చేసిన నిర్వాకం పోలీసుల గుండెల్లో గుబులు రేపింది. ఏకంగా కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన మహిళా పోలీస్ కానిస్టేబుల్‌తో పెట్టుకున్న అక్రమ సంబంధం ఎస్సై పదవికే ఎసరు పెట్టింది. ఇటువంటి కారణాల చేత సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్లు క్రమశిక్షణ నియమావళి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది.

ఇదంతా ఓవైపు అయితే రూరల్ మండలాల్లోని పోలీస్ సిబ్బంది రెండేళ్లకు మించి నిలదొక్కుకోవడం అంత ఆషామాషీ కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ నిజామాబాద్ రూరల్ మండలాలకు నిఖార్సయిన పోలీస్ ఉన్నతాధికారులను పంపించి, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేకూర్చేలా చూడాలని రూరల్ ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed