'గులాబీ ఆకర్ష్' కవిత గెలుపు కోసమేనా!

by  |
గులాబీ ఆకర్ష్ కవిత గెలుపు కోసమేనా!
X

దిశ, న్యూస్‌బ్యూరో: స్థానిక సంస్థల కోటాలో నిజామాబాద్ ఎంఎల్‌సీ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రమంతా కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతూ ఉంటే అధికార పార్టీ మాత్రం అభ్యర్థి గెలుపు కోసం తాపత్రయపడుతోంది. ముఖ్యమంత్రి కుమార్తె అయిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇక్కడ టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తుండడం ఇందుకు కారణం. విజయానికి అవసరమైనంత ఓటర్ల సంఖ్యాబలం ఉన్నప్పటికీ ‘క్రాస్ ఓటింగ్’ భయం ఆ పార్టీని వెంటాడుతోంది. అందుకే ఓటర్లుగా ఉన్న ప్రతిపక్షాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆకర్షించే ఎత్తుగడలు మొదలయ్యాయి. ఎన్నికల సంఘం గతంలోనే షెడ్యూలు ప్రకటించినా కరోనా లాక్‌డౌన్ కారణంగా పోలింగ్ జరగకుండా వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియకపోయినా ఈ తరహా చర్యలతో ముందస్తు ఏర్పాట్లలో టీఆర్ఎస్ నిమగ్నమైంది. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిపత్యం కనబర్చినా లోక్‌సభ ఎన్నికల దగ్గర చేదు అనుభవం ఎదురైంది. సిట్టింగ్ ఎంపీగా ఉండి కూడా కవిత గెలవలేకపోయారు. ఓటమి తర్వాత అటు పార్టీలోగానీ ఇటు ప్రజా ప్రతినిధిగా గానీ లేకపోవడంతో ఎంఎల్‌సీగా గెలవాలనుకుంటున్నారు.

ఈ జిల్లా ఎంఎల్‌సీ ఎన్నికలకు మొత్తం 824 మంది ఓటర్లు ఉంటే ఇందులో 570 అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందినవే. ఆ తర్వాతి వరుసలో కాంగ్రెస్‌కు 152, బీజేపీకి 78 చొప్పున ఉన్నాయి. మరో 24మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఎంఎల్‌సీగా కవిత గెలుపు ఖాయం. కానీ అంచనాలు ఒకలాగ ఉంటే ఫలితం మరోలా ఉండేందుకు ఈ జిల్లాలో చాలా అనుభవాలే ఉన్నాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ తరఫున వెంకట్రామరెడ్డి బరిలో దిగారు. అప్పుడు బలమైన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం తరపున అరికెల నర్సారెడ్డి పోటీ చేశారు. గణాంకాల ప్రకారం చూస్తే వెంకట్రామిరెడ్డి గెలుపు ఖాయం. కానీ క్యాంపు రాజకీయాలు, పార్టీలు మారడం లాంటి చర్యలతో అరికెల నర్సారెడ్డి గెలుపొందారు. ఇలా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అప్పట్లో వైఎస్సార్ ఊహించలేకపోయారు. ఇప్పుడు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందినా లోక్‌సభ ఎన్నికల నాటికి అది రివర్స్ అయింది. ఫలితంగా కవిత ఓడిపోయారు.

ఇప్పుడు కూడా ఇలాంటి క్రాస్ ఓటింగ్ జరుగుతుందేమోననే భయం టీఆర్ఎస్‌ను వెంటాడుతోంది. అందుకే తగినంత సంఖ్యా బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ కారణంగా పుట్టి మునగకూడదని భావిస్తోంది. అందుకే గులాబీ ఆకర్ష్‌కు తెర లేపింది. ఇటీవలి కాలంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ముగ్గురు కార్పొరేటర్లు, ఒక జెడ్‌పీటీసీ సభ్యురాలు బీజేపీని విడిచిపెట్టి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్త సమక్షంలో వీరు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సమక్షంలో ఒక కాంగ్రెస్ కౌన్సిలర్, మరో ఎంపీటీసీ సభ్యులు (కాంగ్రెస్) టీఆర్ఎస్‌లో చేరారు. తాజాగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో మరో నలుగురు స్థానిక ప్రజా ప్రతినిధులు బీజేపీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక ఎమ్మెల్యేల సమక్షంలో వీరు పార్టీలో చేరుతున్నప్పటికీ దీనికి వ్యూహం మొత్తం హైదరాబాద్ నుంచే నడుస్తోందన్నది బహిరంగ రహస్యం.

ఎట్టి పరిస్థితుల్లో కవిత గెలవాలన్న పక్కా వ్యూహంతోనే టీఆర్ఎస్ ఈ చర్యలకు పాల్పడుతోందని బీజేపీ, కాంగ్రెస్ స్థానిక నేతల అభిప్రాయం. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని బీజేపీ గెల్చుకోవడంతో ఇప్పుడు ఆ పార్టీకి చెందినవారిపైనే టీఆర్ఎస్ ఎక్కువ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ చేతిలో సైతం 150కుపైగా ఓట్లు ఉన్నందున ఆ పార్టీని కూడా వీలైనంతగా బలహీనం చేయడం ద్వారా ఎన్నికల్లో సునాయాసంగా గెలవొచ్చునని టీఆర్ఎస్ భావిస్తోంది. క్రాస్ ఓటింగ్ భయం కారణంగానే అవసరం లేకున్నా ఇతర పార్టీలవారిని చేర్చుకోవడం ద్వారా ఓటమి అవకాశాలు లేకుండా చేసుకుంటోంది. కరోనా కష్టకాలంలో సంస్కరణలు అవసరమా అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి తూర్పారబడుతున్నారు. కానీ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అదే కరోనా కష్టకాలంలో ఇతర పార్టీలవారిని చేర్చుకునే పనుల్ని టీఆర్ఎస్ ముమ్మరం చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఇలాంటి వలసలు ఇంకా భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉంది.

ఏడాది కాలంగా ఎలాంటి పదవీ లేకుండా ఉన్న కవితకు ఇప్పుడు ఎమ్మెల్సీ కావడం అతి అవసరమైన అంశంగా మారిందని విపక్షాలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బహిరంగ వేదికలమీద కనిపించడాన్ని వీలైనంతగా తగ్గించుకున్న కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదని పార్టీ గట్టిగానే చెప్పినట్లు స్థానిక టీఆర్ఎస్ నేతలు చెప్తున్న మాట. మరోసారి ఓటమి చవిచూడరాదన్నది పార్టీ భావన. అందుకే ఓటమికి ఉన్న అవకాశాలన్నింటినీ చక్కదిద్దుకునే క్రమంలో ఈ వలసలను ప్రోత్సహించడం.

ఇప్పటివరకు టీఆర్ఎస్‌లో చేరిన విపక్ష పార్టీలకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు:

విక్రమ్ గౌడ్, 8వ వార్డు కార్పొరేటర్ (బీజేపీ); సాధు వర్ధన్, 9వ వార్డు కార్పొరేటర్ (బీజేపీ); బట్టు రాఘవేందర్, 50వ వార్డు కార్పొరేటర్ (బీజేపీ); వై. యమున, నందిపేట జెడ్పీటీసీ సభ్యురాలు; కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ చాట్ల వంశీకృష్ణ (కాంగ్రెస్); ఆమ్రాద్ ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి (బీజేపీ); గొట్టిముక్కల ఎంపీటీసీ సత్యగంగు (బీజేపీ); గుంజిలి ఎంపీటీసీ సుజాత (బీజేపీ); ఇసపల్లి ఎంపీటీసీ లినిత (బీజేపీ) తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అంబారీపేట ఎంపీటీసీ కూడా టీఆర్ఎస్‌లో చేరారు.


Next Story

Most Viewed