పాడి గేదె.. కొత్తది కానరాదె!

by Shyam |

<p>దిశ, నిజామాబాద్: ‘పాడి గేదెలను కొనుగోలు చేశాం. దీన్ని ధ్రువీకరిస్తూ పశువైద్యులు పత్రాలను జారీ చేశారు. ఇందుకోసం ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. పశువుల కొనుగోలులో పర్సంటేజీలు పుచ్చుకోలేదు’ ఇదిగో ఇలాంటి లేఖల కోసం నిజామాబాద్ జిల్లాలో రైతుల చుట్టూ పశువైద్యాధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పశువుల కొనుగోలులో తమ చేతివాటం ఎక్కడ బయటపడుతుందోనని కొందరు పశువైద్యాధికారులు ఇలా తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంపొందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2018, ఆగస్టులో పశుపోషణ పథకం ప్రవేశపెట్టింది. రైతులకు [&hellip;]</p>

పాడి గేదె.. కొత్తది కానరాదె!
X

దిశ, నిజామాబాద్:
‘పాడి గేదెలను కొనుగోలు చేశాం. దీన్ని ధ్రువీకరిస్తూ పశువైద్యులు పత్రాలను జారీ చేశారు. ఇందుకోసం ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. పశువుల కొనుగోలులో పర్సంటేజీలు పుచ్చుకోలేదు’ ఇదిగో ఇలాంటి లేఖల కోసం నిజామాబాద్ జిల్లాలో రైతుల చుట్టూ పశువైద్యాధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పశువుల కొనుగోలులో తమ చేతివాటం ఎక్కడ బయటపడుతుందోనని కొందరు పశువైద్యాధికారులు ఇలా తంటాలు పడుతున్నారు.

రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంపొందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2018, ఆగస్టులో పశుపోషణ పథకం ప్రవేశపెట్టింది. రైతులకు పాడి పశువులను పంపిణీ చేయడం ద్వారా పాడి పరిశ్రమను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఒక్కో యూనిట్ ధర రూ.80 వేలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు రూ. 30 వేలు, మిగిలిన రైతులకు రూ. 20 వేల రాయితీ లభిస్తుంది. ఒక్కో యూనిట్ కొనుగోలు కోసం లబ్ధిదారులకు రూ.72 వేలను అందజేస్తారు. రూ.8 వేలను పశువుల దాణా, మందుల కోసం మినహాయిస్తారు.

పాల సహకార సంఘాలు లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. అనంతరం ఎంపిక జాబితాను పశువైద్యులకు అందజేస్తుంది. ఎంపికైన పాడి రైతుల అభీష్టం మేరకు ఎక్కడైనా పాడిగేదెను కొనుగోలు చేయవచ్చు. దీన్ని ధ్రువీకరిస్తూ పశువైద్యులు పత్రాలను జారీ చేస్తారు. ఆ ధ్రువీకరణ పత్రాలను పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి పంపిస్తారు. వాటిని పరిశీలించి అధికారులు ఓకే చేస్తే పాడి పశువుల విక్రేతల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

నిజామాబాద్ జిల్లాలో విజయ డెయిరీ ద్వారా పాడి రైతులను ఎంపిక చేశారు. గ్రామాలను యూనిట్‌గా తీసుకుని రూ. 80 వేల విలువైన ఒక్కోపాడి గేదెను పంపిణీ చేశారు. కానీ, జిల్లాలోని కొందరు పశువైద్యులు తమ తెలివితేటలను ప్రదర్శించారు. పాడి పశువుల కొనుగోలులో గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. అప్పటికే రైతుల దగ్గర ఉన్న గేదెలను కొత్తగా కొనుగోలు చేసినట్లు సర్టిఫికెట్లను జారీ చేశారు. ఇందుకోసం ఒక్కో పాడిగేదెకు రూ. 5 నుంచి రూ. 10 వేల వరకు వసూలు చేశారు. గేదెలకు ట్యాగ్‌లు, బీమా చేయించి కొత్తగా కొనుగోలు చేసినట్లు నిధులు మంజూరు చేశారు.

జిల్లాలో 2,989 యూనిట్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం రూ. 14.43 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 1,804 పాడి గేదెలను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటి ప్రకారం… ఒక్కో గేదె రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల పాల ఇచ్చినా ఉత్పత్తిలో ఎంతోకొంత మార్పు చోటుచేసుకోవాలి. కానీ, పాల ఉత్పత్తిలో ఎలాంటి మార్పులు జరగలేదు. జిల్లాలో పథకం అమలు చేయకముందు అంటే.. 2017లో ఎంత మేరకు పాల ఉత్పత్తి జరిగిందో ప్రస్తుతం కూడా అంతే ఉండటం అనుమానాలకు తావిచ్చింది. దీంతో పశువైద్యాధికారుల అవినీతి బాగోతం బహిర్గతమైంది.

పాడి గేదెల కొనుగోలులో చేతివాటం వ్యవహారం ప్రస్తుతం పశుసంవర్ధక శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉన్నతాధికారులు విజిలెన్స్ విచారణ చేయిస్తున్నట్లు సమాచారం. దీంతో తమ గుట్టు ఎక్కడ రట్టవుతుందోనని ఆందోళన చెందుతున్న ఆ పశువైద్యాధికారులు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వీరికి ఓ ఉన్నతాధికారి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక విధంగా తప్పించుకోవడం పాడి రైతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రైతుల నుంచి చ్చీలురమని లేఖలు తీసుకుని, వాటిని పశుసంవర్ధక సంచాలకులకు సమర్పించే పనిలో ఉన్నారు.

Tags: nizamabad, milk production, buffalo distribution scheme, fully Corruption, animal husbandry doctors

Next Story