టెస్లా కంపెనీ అలా చేస్తే పన్నులు తగ్గొచ్చు : నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్

by  |
టెస్లా కంపెనీ అలా చేస్తే పన్నులు తగ్గొచ్చు : నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాను, భారత్‌లో కార్ల తయారీ చేపట్టాలని నీతి ఆయోగ్ వైస్-ఛైర్మన్ రాజీవ్ కుమార్ కోరారు. ఆ తర్వాత సుంకాలకు సంబంధించిన ప్రయోజనాలను ప్రభుత్వం తప్పకుండా అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. వర్చువల్ విధానంలో జరిగిన పబ్లిక్‌ ఫోరమ్ ఆఫ్‌ ఇండియా(పీఏఎఫ్‌ఐ) సమావేశంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ఇటీవల టెస్లా కంపెనీ అధికారులు భారత్‌లో ప్రవేశించడానికి ముందు విదేశాల్లో ఉత్పత్తి చేసిన తమ కార్లను భారత్‌కు ఎగుమతి చేసి, పట్టు సాధించిన తర్వాత మార్కెట్లోకి వస్తామని ప్రతిపాదించారు. అయితే, ఈ విధానం పాతకాలం నాటిదని, టెస్లా మరింత కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని రాజీవ్ కుమార్ కోరారు.

ఇతర చోట్ల నుంచి టెస్లా తన కార్లను భారత్‌కు రవాణా చేసే బదులుగా స్థానికంగానే తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మేలు. దీనివల్ల టెస్లా కంపెనీతో పాటు కార్లను కొనే వినియోగదారులకు కూడా ప్రయోజనాలు ఉంటాయని రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇదివరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం టెస్లా కంపెనీ మొదటగా భారత్‌లో తయారీని చేపట్టాలని, అనంతరం పన్ను తగ్గింపు గురించి పరిశీలిస్తామని స్పష్టం చేశారు. కాగా, భారత్‌లో ఇప్పటికే టెస్లాకు చెందిన పలు మోడళ్లకు కేంద్రం ధృవీకరణ ఇచ్చింది. సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ సైతం ఇప్పటికే పలుమార్లు భారత్‌లో కార్ల దిగుమతిపై సుంకాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.



Next Story

Most Viewed