హాట్ స్పాట్‌గా నిర్మల్ జిల్లా..!

by  |
హాట్ స్పాట్‌గా నిర్మల్ జిల్లా..!
X

దిశ, ఆదిలాబాద్:

కరోనా వైరస్ (కోవిడ్ 19) మహమ్మారి ప్రభావం నిర్మల్ జిల్లా‌పై తీవ్రస్థాయిలో ఉందా..? అంటే అవుననే ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. గురువారం 22 వైద్య, ఆరోగ్య శాఖ టీంలతో కరోనా లక్షణాలున్న వారి సర్వే నిర్వహించారు. అయితే, నిన్న అర్ధరాత్రి అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే..మరో 100 వైద్య, ఆరోగ్య శాఖ టీంలను జిల్లాకు తీసుకురావడం. ఈ టీంలు శుక్రవారం ఉదయం నుంచి జిల్లా
కేంద్రాల్లో తిరుగతాయి. ఇది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి కొన్ని వైద్య, ఆరోగ్య శాఖ టీంలను రంగంలోకి దింపడానికి కారణం జిల్లాలో కరోనా ఉగ్రరూపమేనని ఆరోగ్యశాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి.

కరోనా నేపథ్యంలో నిర్మల్ జిల్లాను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ హాట్ స్పాట్ జాబితాలో జిల్లాను చేర్చినట్లు సమాచారం. ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారం ఆరోగ్య శాఖ వర్గాలను కుదిపేస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రికి రాత్రే జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఫీల్డ్ సిబ్బందిని శుక్రవారం ఉదయం 7 గంటలకు నిర్మల్ చేరుకోవాలనీ, 100 టీములతో మూడు రోజుల పాటు విస్తృత సర్వే చేయాలని నిర్ణయించారు. దీన్ని బట్టి చూస్తే కరోనా తీవ్రత ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంటింటా స్క్రీనింగ్.!

జిల్లాలోని నిర్మల్, భైంసా పట్టణాలను హాట్ స్పాట్లు‌గా గుర్తించి ఈ రెండు ప్రాంతాల్లో ఇంటింటి స్క్రీనింగ్ చేయాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

‘మర్కజ్’ పాజిటివే ఇందుకు కారణం కావొచ్చు.

ఢిల్లీలో మర్కజ్ తబ్లీగీ జమాత్‌ సభకు హాజరై వచ్చిన నిర్మల్‌కు చెందిన సయ్యద్ ఇసాక్ కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం దాకా ఇసాక్ కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరినప్పటికీ, గుండెపోటుతో మరణించాడని ప్రచారం జరిగింది. కాని అదే రోజు సాయంత్రానికి ఇసాక్ కరోనాతో చనిపోయాడని జిల్లా కలెక్టర్ ముషారఫ్ స్వయంగా ప్రకటించారు. దీంతో కలవరం మొదలైంది. ఇసా‌క్‌తో పాటు ఆయన కుటుబీకులకూ కరోనా లక్షణాలు ఉన్నాయన్న ప్రచారం ఆందోళనకు కారణమవుతున్నది. నిర్మల్‌తో పాటు భైంసా నుంచి కూడా పెద్ద సంఖ్యలో డిల్లీ మర్కజ్‌కు వెళ్లారని ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం‌తో ఈ రెండు ప్రాంతాలను హాట్ స్పాట్‌గా గుర్తించారని అధికారవర్గాల సమాచారం.

భద్రత లేకుండానే..

కరోనా సర్వేకు ఆరోగ్య శాఖలో పని చేసే ఉద్యోగులు సాహసంతో ముందుకు వెళ్లే పరిస్తితి ఏర్పడింది. నిర్మల్‌లో నమోదైన కరోనా తొలి కేసు ఇసాక్ నివాసం జొహ్రనగర్ నుంచి కిలోమీటర్ రేడియస్ కరోనా ప్రమాదకర ప్రాంతంగా ఉందని అధికారులే చెబుతున్నారు. అయితే, ఈ ప్రాంతంలో సర్వే నిర్వహించనున్న ఆరోగ్య సిబ్బందికి మాత్రం కనీస రక్షణ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్-95 మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజ్‌లు సమకూర్చవలసిన అవసరమున్నది. వైద్యులు, సిబ్బందికి రక్షణ చర్యలు చేపట్టకుండా సర్వే సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పడం సమంజసమేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Tags: nirmal dist, karona hotspot, covid 19, positive cases registered



Next Story