తీరు మార్చుకోని నేతలు.. హుజురాబాద్ ఓటర్ల థింకింగ్ అదేనా.?

by  |
Huzurabad
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఆయన అంతటి వాడు.. నేను అంతకన్నా గొప్ప వాన్ని, ఆయన ఛీటర్.. నేనయితే బెటర్. దొందు దొందే మా పార్టీయే సూపర్ అంటూ గళమెత్తుకున్న ఆయా పార్టీల నాయకులు హుజురాబాద్ విషయాన్నే విస్మరించారని అనిపిస్తోంది. ఓట్లు వేసేది ఇక్కడి వారే అయినా నేతలు మాట్లాడే అంశాల్లో వ్యక్తిగత ఆరోపణలతో పాటు రాష్ట్ర స్థాయి విషయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వీరు తమ తప్పులను కప్పి పుచ్చుకుంటూ ప్రత్యర్థుల తప్పిదాలను ఎత్తి చూపుతూ ముందుకు సాగుతున్నారు తప్ప స్థానికుడి అవసరం ఏంటీ, వాటిని ఎలా తీరుస్తాం అన్న విషయాలను విస్మరిస్తున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో కలియ తిరుగుతూ తమ పార్టీల ప్రాపకం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తమకు ఓట్లేసి గెలిపించే ఓటరు దేవుళ్ల స్థితిగతులను మార్చేందుకు ఏం చేస్తామో మాత్రం చెప్పడం లేదు.

ఐదు నెలలుగా ఇదే తంతు..

కేసీఆర్ అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్యే ఈ ఎన్నికలు అని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ నినదిస్తున్నారు. ఈటల స్వార్థం వల్లే ఎన్నికలు వచ్చాయంటూ టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రెండు పార్టీలపై ధ్వజమెత్తుతూ ప్రచారం చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. స్థానికుల అవసరాలేంటి, ఈ నియోజకవర్గ అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన పనులేంటి అన్న విషయం గురించి అంతగా పట్టించుకోవడం లేదన్న వాదన సగటు ఓటరులో నెలకొంది.

యువత భవిత ఏదీ..?

ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లేక, ఉపాధి దొరకక కాలం వెల్లదీస్తున్న యువతరం గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారనే చెప్పాలి. నోటిఫికేషన్లు విడుదల చేయడం లేదని ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. 80 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే హుజురాబాద్ నియోజకవర్గ స్థాయిలో ఇక్కడి యువతకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నామని మాత్రం ఎవరూ ప్రకటించడం లేదు.

అలాగే అభివృద్ధి విషయంలో ఎలాంటి విజన్‌తో ముందుకు సాగుతామో అన్న విషయాన్ని ఎవరూ చెప్పడం లేదు. నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంటీ ఇక్కడ ప్రజల సంక్షేమం కోసం ఏం చేయబోతున్నామన్న మేనిఫేస్టోను కూడా విడుదల చేయలేదు. కేవలం రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలను లేవనెత్తడం, ఆరోపణలు చేస్తుండటం వంటి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప క్షేత్ర స్థాయిలో ఇక్కడి బిడ్డలకు ఏం చేయబోతున్నామనే విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు.


Next Story

Most Viewed