నూతనంగా 11 వంగడాలు విడుదల

431
VC Praveen Rao

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరుపున ప్రవేశపెట్టిన వంగడాలు దేశవ్యాప్తంగా మంచి ఆదరణను పొందాయని వీసీ ప్రవీణ్ రావు అన్నారు. గురువారం 11 నూతన వంగడాలను విడుదల చేశామని ప్రకటించారు. వీటిలో 5 వరి, జొన్న 2, కంది 01, పెసర 01, సోయా చిక్కుడు 01, నువ్వులు 01 రకాల చీడ పీడను తట్టుకొనే రకాలను రూపకల్పన చేశామన్నారు.

వరిలో చౌడును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రెండు మధ్యకాలిక రకాలు, సువాసన గల ఒక పొడవు గింజ రకం, స్వల్పకాలిక సన్నగింజ కలిగిన రెండు రకాలను, అధిక దిగబడులిచ్చే రెండు తెల్లగింజ జొన్న రకాలను విడుదల చేశామన్నారు. సోయాచిక్కుడు పంటలో ప్రస్తుతం జె.యస్-335 రకాన్ని మాత్రమే ఎక్కువగా సాగుచేస్తున్నారని, దీనికంటే 10 శాతం అధిక దిగుబడినిచ్చు ఏఐఎస్ బి-50 అను వంగడమును రూపొదించామన్నారు.

కందిలో ఎండు తెగులును తట్టుకొనే వరంగల్ కంది – 2 (డబ్ల్యుఆర్జి 255), పెసరలో చీడపీడలను తట్టుకొనే మధిర పెసర యంజీజీ 385 అను వంగడాలను, నువ్వు పంటలో జగిత్యాల తిల్-2 (జెసియస్ 2454) అను తెల్ల గింజ రకాన్ని గుర్తించి విడుదల చేశామన్నారు.

గత 6ఏళ్లుగా వ్యవసాయ యూనివర్సిటీ నుంచి అధిక ఉత్పత్తినిచ్చే, చీడపీడల్ని తట్టుకునే 47 వంగడాలను రూపకల్పన చేశామని తెలిపారు. దీంతో పీజెటీఎస్ఏయూకి ఐసీఏఆర్ లోనూ మంచి గుర్తింపు లభించిందన్నారు. వీటితో పాటు అనేక అంశాల్లో వర్సిటీ ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ప్రతి ఏటా సగటున 30 పైగా విద్యార్థులు జేఆర్ఏస్లు సాధిస్తున్నారని పేర్కొన్నారు. ఐఆర్ఆర్‌, ఇక్రిసాట్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కొత్త టెక్నాలజీలని అందిపుచ్చుకున్నట్లు వివరించారు.

రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ వంటి అధునాతన పరిజ్ఞాన వినియోగంలో వర్సిటీ ముందడుగులో ఉందని వివరించారు. డ్రోన్లతో పరిశోధనలు సాగించడానికి డీజీపిఏ దేశంలోనే తొలిసారిగా పీజెడీఎన్ఏయుకు అనుమతి ఇచ్చిందని ప్రకటించారు. ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీలో త్వరలోనే అగ్రిహబ్‌ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లాకి ఒకపంట పథకంలో వర్సిటీకి మూడు జిల్లాల కోసం రూ.8.4 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

సోలార్ ప్యానెల్ కింద పంటలు పండించే విధానంపై రబీ నుంచి పరిశోధనలు చేయనున్నామని వివరించారు. వర్సిటీ తరపున రాష్ట్రంలోని అన్ని జిల్లాల సాయిల్ మ్యాపింగ్ పూర్తయిందని చెప్పారు. భాస్వరం పాళ్లు ఎక్కువున్న చోట్ల రైతు క్షేత్రాల్లో 1000 ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుననామని తెలిపారు. రాష్ట్రంలో పెరిగిన నీటి పారుదల సౌకర్యాలను వినియోగించుకునేందుకు నీటియాజమాన్యం పద్ధతులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి లేదు

రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు లేవని అగ్రీ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్ రావు స్పష్టం చేశారు. ఏవైనా ప్రైవేటు యూనివర్సిటీలు వ్యవసాయం కోర్సును ప్రారంభిస్తే ఐసీఏఆర్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో వ్యవసాయ కోర్సులకు తక్కువ ఫీజులున్నాయని, వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సుమారు రూ.25లక్షలు ఖర్చుచేస్తుందని వివరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..