కొత్త కానిస్టేబుళ్లకు జీతాలు ఎప్పుడు?

by  |
కొత్త కానిస్టేబుళ్లకు జీతాలు ఎప్పుడు?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కొత్తగా కొలువులోకి వచ్చిన కానిస్టేబుళ్లకు ఇంకా తొలి వేతనం అందలేదు.. తొమ్మిది నెలల కఠోర శిక్షణ పూర్తి చేసుకుని.. ఉద్యోగంలో చేరారు. మూడు నెలలు గడిచినా జీతాలు అందకపోవడంతో నానా ఇక్కట్లు పడుతున్నారు. సుమారు 12 వేల మంది కొత్త కానిస్టేబుళ్లు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎంప్లాయి, పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాన్) ఐడీలు లేకపోవటంతోనే మరో వారం, పది రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.. వాస్తవానికి బడ్జెట్ కొరత వల్లనే వేతనాలు జమ చేయటం లేదని తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోలీసు రిక్రూట్‌మెంట్ చేపట్టగా.. వీరికి గతేడాది శిక్షణ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 వేల మందిని రిక్రూట్ చేశారు. ఇందులో 12 వేల మంది సివిల్, ఆర్ముడ్ రిజర్వు(ఏఆర్), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పీ‌ఎఫ్)కు చెందిన వారుండగా.. మరో 4వేల మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసులు ఉన్నారు. ప్రస్తుతం 4 వేల మంది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు (టీఎస్పీఎస్)లకు ఇంకా శిక్షణ కొనసాగుతోంది. 12 వేల మంది సివిల్, ఆర్ముడ్ రిజర్వు(ఏఆర్), స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్‌పీ‌ఎఫ్)కు చెందిన వారికి మాత్రం జనవరి 17, 2020న శిక్షణ ప్రారంభించి.. అక్టోబర్ 8, 2020న పూర్తి చేశారు. వీరంతా అక్టోబర్ 9న వివిధ జిల్లాల్లో పోస్టింగ్ కోసం రిపోర్టు చేశారు. వీరందరూ ఆయా జిల్లాల్లో విధుల్లో చేరి మూడు నెలలు గడిచినా.. ఇప్పటి వరకు ఒక్క నెల వేతనం కూడా అందలేదు. వాస్తవానికి ప్రతి నెలా 1వ తేదీన వేతనాలు అందించాల్సి ఉండగా.. కరోనా కారణంగా 9, 10వ తేదీల్లో వేతనాలు వేస్తున్నారు.

కొత్తగా రిక్రూట్‌ అయిన పోలీసులకు శిక్షణ సమయంలో రూ.9 వేల చొప్పున ప్రతినెలా స్కాలర్‌షిప్ ఇచ్చారు. ప్రస్తుతం విధుల్లో చేరిన వారికి రూ.16,500 బేసిక్ వేతనం ఉంది. ఇతర అలవెన్సులతో పాటు డీఏ (డెయిలీ అలవెన్సు) ఇవ్వాల్సి ఉంది. దీంతో కొత్తగా విధుల్లో చేరిన వారికి ప్రతినెలా రూ.24 నుంచి 25 వేల చొప్పున వేతనం రావాల్సి ఉంది. స్పెషల్ పార్టీ పోలీసులకు పూర్తి డీఏ చెల్లించాల్సి ఉంటుంది. ఎంప్లాయి ఐడీతో పాటు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (పీ‌ఆర్‌ఏ‌ఎన్) ఐడీ లేకపోవటంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యమైందని పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. మరో వారం, పది రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని.. ఆ తర్వాత వేతనాలు చెల్లించేలా చర్యలు చేపడతామని పేర్కొంటున్నారు. వాస్తవానికి బడ్జెట్ కొరత ఉండటం వల్లనే వేతనాల చెల్లింపులో జాప్యమవుతోందని సమాచారం. విధుల్లో చేరి మూడు నెలలు గడిచినా.. ఒక్క నెల వేతనం కూడా రాకపోవటంతో కుటుంబాలు ఎలా నెట్టుకురావాలని కొత్తగా నియామకమైన పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed