రెవె‘న్యూ’ చట్టం.. సమస్యలొస్తే కోర్టులే శరణ్యమా..?

by  |
రెవె‘న్యూ’ చట్టం.. సమస్యలొస్తే కోర్టులే శరణ్యమా..?
X

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో ‘భూమిపై హక్కులు, పట్టాదారు పుస్తకాల చట్టం- 2020’ వచ్చేస్తోంది. కొత్త సదుపాయాలను కల్పిస్తోంది. దాంతో పాటే కొత్త సమస్యలను సృష్టించనుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఉన్న సమస్యలను మరింత జఠిలం చేస్తుందేమోననే సందేహాలూ వ్యక్తం అవుతున్నాయి. భూముల నమోదులో తుది నిర్ణేతగా మారిన తహసీల్దార్ అన్యాయం చేశారని అనుకుంటే ఎలాంటి అప్పీళ్లు ఉండవు. నేరుగా సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే. రెండు సంవత్సరాలుగా మేధావులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ లు, రెవెన్యూ చట్టాల నిపుణులంతా కూర్చొని కొత్త చట్టాన్ని రూపొందించారు. ఇప్పటి దాకా కొందరు వీఆర్వోలు, మరికొందరు తహశీల్దార్లు అవినీతి, అక్రమాల జాబితాలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో వీఆర్ఓ పోస్టునే రద్దు చేశారు. భూములన్నింటికీ తహసీల్దార్ నే సర్వాధికారిగా నిర్ణయించారు. దీంతో సత్ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని రిటైర్డ్ రెవెన్యూ అధికారులు, భూ చట్టాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇంటినే తగులబెట్టినట్లుగా’ ఈ చట్టం ఉందని అంటున్నారు. ఎన్నో కీలకాంశాలకు సమాధానం దొరకని విధంగా ఉందంటున్నారు. ఆర్ఐ, ఆర్డీఓ, అదనపు కలెక్టర్లకు ప్రాధాన్యతే కల్పించలేదు. రెవెన్యూ రికార్డులు, మ్యూటేషన్లలో ఎలాంటి భాగస్వామ్యం లేకుండా చేశారు. ఈ విషయాన్ని ‘దిశ’ ముందుగానే చెప్పింది. ఎలాంటి విచారణ లేకుండానే మ్యూటేషన్ చేసేటట్లుగా ఆటోమెటిక్ విధానాన్ని రూపొందించారు. అన్యాయం జరిగిందని భావిస్తే సివిల్ కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేశారు. దాని ద్వారా పేదలకు ఆర్ధిక భారం, న్యాయం పొందడంలో సమయాభావం చోటు చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

‘ధరణి’ కీలకం..

‘ధరణి’ ఆధారంగానే చట్టాన్ని అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీ ప్రసంగంలో స్పష్టం చేశారు. సమగ్ర భూ సర్వే చేపడుతామనీ అన్నారు. రెండు విభిన్నమైన అంశాలను ప్రస్తావించారు. సర్వే చేస్తామని అంటున్నారంటే రికార్డుల్లో వ్యత్యాసాలు ఉన్నట్లే కదా? ఓ రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండా మ్యూటేషన్ చేయడం ద్వారా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. కొనుగోలు చేసేవారికి మేలు కలుగుతుంది. అభ్యంతరాలను స్వీకరించకపోతే హక్కుదారులు అన్యాయానికి గురవుతారు. ఆర్వోఆర్ చట్టం రూపకల్పన ద్వారా ఖాస్రా పహాణీ, ఆ తర్వాత చెస్లా ఫైనల్ అన్నారు. 1971లో కొత్త చట్టమంటూ 1 బి రికార్డులు ఫైనల్ గా తీసుకున్నారు. ఇప్పుడేమో ధరణి రికార్డులే, డేటానే ఫైనల్ గా ప్రకటిస్తున్నారు.ఈ డేటాలోని లోపాలతో అనేక మంది ఇబ్బందులకు గురవుతారని భూ చట్టాల నిపుణుడు ప్రొ.ఎం.సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు.

పార్టు ‘బి’ ప్రస్తావనేది..?

భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ప్రతి గ్రామంలోనూ వివాదాల కారణంగా పదుల సంఖ్యలో పార్టు ‘బి’ భూములుగా ప్రకటించారు. వాటికి కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వలేదు. ధరణిలోనూ క్రోఢీకరించలేదు. ఇప్పటికీ వాటిని పెండింగులో పెట్టారు. పరిష్కారానికి ఎలాంటి మార్గాన్ని చూపలేదు. ఇప్పటికే ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అప్పీళ్లను, రివిజన్ పిటిషన్ల వాదనలను నిలిపివేయాలంటూ ఆర్డీఓలను, అదనపు కలెక్టర్లను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రత్యేక ట్రిబ్యునళ్లు ఏర్పడి ఫంక్షనింగ్ మొదలు పెట్టే వరకు ఎంత కాలం పడుతుందో తెలియదని రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ బి.నాగేంద్ర అన్నారు.

పాత RORతోనే అమలు చేస్తే సక్సెస్..

‘ధరణి’ లోప భూయిష్టం. పార్టు ‘బి’ కింద అనేకం పెండింగులోనే ఉన్నాయి. పాత ఆర్వోఆర్ ఆధారంగా ఈ చట్టాన్ని అమలు చేస్తే సక్సెస్ అవుతుంది. లేదంటే ఎంతో మందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది. చట్టం ద్వారా మేలు చేయాలంటే సీఎం అసెంబ్లీలో ప్రకటించినట్లుగా భూ సర్వే చేపట్టాలి. ధరణి రికార్డులు సక్రమంగా లేవని ఒప్పుకున్నట్లే. బౌండరీస్ సరిగ్గా లేనట్లే. ఇప్పటికే సివిల్ కోర్టుల్లో కేసులు అనేకం పెండింగులో ఉన్నాయి. ఇప్పుడీ చట్టం అమలు ద్వారా మరిన్ని కేసులు వచ్చే అవకాశం తలెత్తుతుంది. 16 వేల కేసుల కోసం ఎలాగూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. వాటిని జిల్లాకొకటి, అప్పీలేట్ కోసం రాష్ట్ర స్థాయిలో మరొకటి నిరంతరంగా ఉండేటట్లు చేయాలి. పేదలెవరూ ఉచితంగా న్యాయ సలహాలు పొందే అవకాశం లేదు. అందుకే ఉచిత న్యాయ సలహా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. చట్టంలోనే ఈ అంశాన్ని చేర్చాలి. టైటిల్ గ్యారంటీ కల్పించాలి. అప్పుడు నేనే సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయంపై కీర్తిస్తూ పుస్తకాన్ని రాస్తా.

– ఎం.సునీల్ కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్

మా కొడుక్కి పిల్లనివ్వడం కష్టం..

‘మూడేండ్లుగా రెవెన్యూ శాఖను బద్నాం చేశారు. వీఆర్వోలు, తహసీల్దార్లు అత్యంత అవినీతిపరులని ముద్ర వేశారు. వీఆర్వోలను తీసేశారు. మాకేమో కీలక బాధ్యతలను అప్పగించారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు పని చేయాల్సి వస్తుంది. అప్పుడు మేమే బాధ్యులం అవుతాం. ఇప్పటికే మమ్మల్ని అవమానకరంగా చూస్తున్నారు. మేం ఎక్కడికి వెళ్లినా అవినీతి కోణంలోనే చూస్తున్నారు. మేం తెల్ల బట్టలు వేసుకొని, చేతికి ఉంగరాలు పెట్టుకొని ఏదైనా ఫంక్షన్ కు వెళ్తే వింతగా చూసే రోజులొచ్చాయి. మా భూములు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నా నమ్మే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. రెండు రకాలు ఉంటారు. పని చేసినందుకు ఇస్తే ఏదో ఇచ్చింది తీసుకునేవారు కొందరు. దరఖాస్తుదార్లను పీడించి వసూలు చేసే వాళ్లు ఇంకొందరు. అందరినీ ఒకే గాఢిన కట్టేశారు. ఇప్పుడు మా కొడుక్కి పిల్లనివ్వడం కూడా కష్టమే’

– నగర శివారులోని ఓ తహసీల్దార్ ఆవేదన


Next Story

Most Viewed