కొత్త రికార్డుపై కన్నేశారు

by  |
కొత్త రికార్డుపై కన్నేశారు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నుంచి యాసంగికి నీరు విడుదల ప్రారంభమైంది. ప్రాజెక్ట్ అధికారులు జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రాజెక్ట్‎లో 75 టీఎంసీల మేర నీరు నిల్వ ఉండటంతో ఈసారి రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం కాకతీయ కాలువకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. మిగులు కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తే గతేడాదికి మించి జలవిద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు.

ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యత్ ఉత్పత్తి ప్రారంభం కావడంతో.. యాసంగి పంటల కోసం కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువల ద్వారా వారబందీ కింద నీటి విడుదల జరుగుతున్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా ప్రతి రోజూ కాకతీయ కాలువకు 6,500 క్యూసెక్కుల నీటి విడుదల జరుగుతుండటంతో అధికారుల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 78.981 టీఎంసీల నీరు నిలువ ఉండగా ప్రతిరోజూ 8,902 క్యూసెక్కుల నీటిని కాలువలకు, మిషన్ భగీరథ పథకాలకు విడుదల అవుతున్నది.

గతేడాది అక్టోబర్27 వరకు కొనసాగిన విద్యుత్ ఉత్పత్తి తిరిగి యాసంగి పంటలకు నీటి విడుదలతో షూరు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కేవలం కాకతీయ కాలువకు మాత్రమే అత్యధిక నీటి విడుదల కొనసాగుతుండటంతో జల విద్యుత్ కేంద్రంలో మూడు టర్బైన్‌ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. ఒకటో టర్బైన్ ద్వారా 6.0 మెగావాట్లు, రెండో టర్బైన్ ద్వారా 6.1, మూడో టర్బైన్ ద్వారా 6.3 మెగావాట్ల విద్యుత్ మొత్తం 18.4 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పతి చేస్తున్నారు. మొదటి టర్బైన్ ద్వారా 0.1434 మిలియన్ యూనిట్లు, రెండో టర్బైన్ ద్వారా జరిగిన విద్యుత్ ఉత్పత్తితో 0.1457 మిలియన్ యూనిట్లు, మూడో టర్బైన్ ద్వారా 0.1524 మిలియన్ యూనిట్లు మొత్తం 0.4415 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరగుతుందని జలవిద్యుత్ కేంద్రం డీఈ శ్రీనివాస్ తెలిపారు.

గత నెల 28 నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. యాసంగి పంటలకు నీరు విడుదల జరిగే ఎప్రిల్ 30 వరకు నిరంత విద్యుత్ ఉత్పత్తి, తయారీ కొనసాగనుంది. ఈ గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 57.8981 మిలియన్ యూనిట్ల విద్యుత్ తయారు చేశారు. 2016లో శ్రీరాంసాగర్ జలవిద్యుత్ కేంద్రం రికార్డు స్థాయిలో 75 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు 78 టీఎంసీల నీరు ఉండటం, ఎప్రిల్ వరకు నీటి విడుదల జరగనుండటంతో కొత్త రికార్డుల అవకాశం ఉందని జల విద్యుత్ కేంద్రం అదికారులు అంచనా వేస్తున్నారు. జలవిద్యుత్ ద్వారా తయారీ అయ్యే విద్యుత్‌ను జేన్‌కో ద్వారా సరఫరా చేస్తున్నారు. జల విద్యుత్ కేంద్రంలో నాలుగు టర్బైన్‌లు ఉండగా మిగిలిన కాలువలకు నీటి విడుదలను పెంపుదల చేస్తే మాత్రం విద్యుత్ ఉత్పత్తి పెరగడం ఖాయం. విద్యుత్ జనరేషన్‌లో 2020-21 కొత్త రికార్డులు లిఖించడం సాధ్యమేనని చెప్పవచ్చు.


Next Story

Most Viewed