ఫేస్‌ మాస్క్‌తో కరోనా టెస్ట్

by  |
ఫేస్‌ మాస్క్‌తో కరోనా టెస్ట్
X

దిశ, ఫీచర్స్ : మొబైల్ ఫోన్‌ మాదిరి ‘ఫేస్‌ మాస్క్’‌ సైతం ప్రస్తుతం హ్యూమన్ బాడీలో ఓ భాగమైంది. కొవిడ్ కణాలను శరీరంలోకి రాకుండా అడ్డుకునే మాస్క్.. ఇకపై కరోనా సోకిందా! లేదా అని కూడా డిటెక్ట్ చేయనుంది. సరికొత్త సెన్సార్ టెక్నాలజీ ద్వారా కొవిడ్-19 నిర్ధారించవచ్చునని హార్వర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ పరిశోధకులు చెబుతున్నారు. మాస్క్‌కు అమర్చిన చిన్న డిస్పోజబుల్ సెన్సార్.. కరోనా వైరస్‌నే కాదు, ఇతర వైరస్‌లను కూడా సమర్ధవంతంగా గుర్తిస్తుందని వారు వెల్లడించారు.

హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చర్లతో పాటు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు సంయుక్తంగా అభివృద్ధి చేసిన సెన్సార్ ఫేస్‌ మాస్క్.. శ్వాసలో కరోనా వైరస్ కణాలు ఉన్నాయో లేదో 90 నిమిషాల్లో గుర్తించగలదు. ఈ విషయం పరిశోధకులు విడుదల చేసిన శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడి కాగా.. దీని ఫలితాలు గోల్డ్-స్టాండర్డ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్షల వలె ఖచ్చితమైనవని స్పష్టం చేశారు. సెన్సార్లను ఫేస్ మాస్క్‌ల్లోనే కాకుండా ల్యాబ్ కోట్స్ వంటి దుస్తుల్లోనూ అమర్చుకోవచ్చు. విధుల్లో భాగంగా వివిధ రకాల వ్యాధికారక లేదా ఇతర వైరస్, బ్యాక్టీరియాల నుంచి ఆపదను ఎదుర్కొంటున్న హెల్త్ కేర్ వర్కర్స్‌కు కూడా ఈ సెన్సార్ టెక్నాలజీ కొత్త మార్గాన్ని అందిస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రమాదకర పదార్థాలు లేదా వ్యాధికారక పదార్థాలతో పనిచేసే శాస్త్రవేత్తలు, వైద్యులు, నర్సులు, సైనిక సిబ్బంది ప్రమాదకరమైన వ్యాధికారక లేదా విషపూరిత వాయువులకు గురయ్యే ప్రదేశాల్లో ఇలాంటి యూనిఫామ్స్ ధరించవచ్చని చెప్పారు.

ఎంఐటీ ప్రొఫెసర్, మెడికల్ లేబొరేటరీ సైంటిస్ట్ కొలిన్స్.. నిర్దిష్ట లక్ష్య అణువులకు ప్రతిస్పందించే సింథటిక్ జన్యు నెట్‌వర్క్‌లను రూపొందించడానికి అవసరమైన ప్రొటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలను పేపర్‌లో పొందుపరచవచ్చని 2014 లో నిరూపించాడు. ఎబోలా, జికా వైరస్‌లను ట్రేస్ చేయడం కోసం పేపర్ డయాగ్నోస్టిక్ రూపొందించడానికి అతను ఈ విధానాన్ని ఉపయోగించాడు. అదేవిధంగా ‘షెర్లాక్’ అని పిలిచే మరొక ‘సెల్ ఫ్రీ సెన్సార్’ సిస్టమ్‌ను కూడా కొలిన్స్ అభివృద్ధి చేశాడు. ఇదే సూత్రానికి మరింత సాంకేతికతను జోడించి పరిశోధకులు సెన్సార్ మాస్క్ డెవలప్ చేశారు.


Next Story

Most Viewed