మట్టిలేని పంట.. కొబ్బరి పీచుతో కొత్త ప్రయోగం

by  |
Crop cultivation
X

దిశ, కుత్బుల్లాపూర్: కొత్తకొత్తగా.. పంట సాగు. మట్టి లేకుండా మొక్కల పెంపకం. మట్టి లేకుండా ఎలా అనుకుంటున్నారా..? నిజమే.. ఈ విధానాన్ని చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. కొబ్బరి పీచుతో సాగు. ఇది వినడానికి కొత్తగా ఉన్నా..నమ్మాల్సిందే. ఎంతో అద్భుతమైన ఈ ప్రయోగాన్ని సక్సెస్‌గా చేసి చూపించారు జీడీమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ శాస్ర్తవేత్తలు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో మొక్కల పెంచడమే కాకుండా.. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో చేపట్టే ఈ సాగు వల్ల మంచి పోషకాలున్న కూరగాయలను పండించవచ్చని చెబుతున్నారు. స్వచ్ఛమైన కూరగాయలతో ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చని ధీమాగా చెబుతున్నారు.

విధానం..

కొబ్బరి పీచును ముక్కలు.. ముక్కలుగాగా చేసి పొడిగా మారుస్తారు. ఆ పొడిని గ్రోబ్యాగ్(ప్లాస్టిక్ కవర్) లో నింపుతారు. ప్రతీ బ్యాగు 18 ఇంచుల వెడల్పులో 18 ఇంచుల పొడవులో ఉంటుంది. ఇందులో కాస్త సేంద్రీయ ఎరువులు కలిపి విత్తనాలు లేదా మొక్కలు నాటుతారు. మొక్కనాటిన నాటి నుంచి ప్రతీ రోజు నత్రజని, భాస్పరం, పొటాష్ ల మిశ్రమాన్ని మితంగా అందించాలి. వాటిలో ఇతర సేంద్రీయ ఎరువులు సైతం వేసుకోవచ్చు.

క్రిమికీటకాలు దరి చేరవు..

కొబ్బరి పీచుతో పండించే పంటలకు క్రిమి, కీటకాలు దరి చేరవు. ఈ పద్ధతి రైతులకు ఎంతో ప్రయోజనకరం. ఈ విధానంలో జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వంకాయ, ఆకుకూరలు, టమాటో, కొత్తిమీర, మెంతి తదితర పంటలు పండిస్తున్నారు. క్రమపద్ధతిలో డ్రిప్ సిస్టం ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ పంట సాగు సఫలం కావడంతో రైతులకు సైతం శిక్షణనిచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

పెంచే పద్ధతులు..

బ్యాగు, బ్యాగుకు మధ్యలో 2 ఫీట్ల వెడల్పు వదిలి వరుసగా పేర్చాలి. మొక్కలు పెట్టిన 45 రోజుల్లోనే మొక్కలు పెరిగి పంటలు చేతికొస్తాయి. లైన్‌లకు మధ్యలోనూ 2 ఫీట్లు వదలాలి. ఒక్కో మొక్క ద్వారా 3 కిలోల పంట చేతికొస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు.

ప్రతీ ప్రయోగం ప్రయోజనకరమే..

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నతాధికారుల సూచనతో ప్రయోగాలు చేస్తున్నాం. ప్రస్తుతం పాలీ హౌస్‌ల్లో ప్రత్యేక పంటలతోపాటు ఇతర పంటలు వేసే పంటల ఒడ్డులో గ్రో బ్యాగులు పెట్టి పంటలు వేశాం. మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ పంటలను ఎక్కువగా నగరాల్లో ఉన్న చిన్న స్థలాల్లో పెట్టుకునేందుకు ఇష్టపడుతున్నారు. రైతులకు కూడా ప్రయోజనకరమే. – రాజ్ కుమార్, సీఓఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్


Next Story

Most Viewed