రెచ్చిపోతున్న ప్రైవేట్ స్కూల్స్.. యథేచ్చగా అడ్మిషన్లు

by  |
రెచ్చిపోతున్న ప్రైవేట్ స్కూల్స్.. యథేచ్చగా అడ్మిషన్లు
X

దిశ, పటాన్ చెరు: లాక్ డౌన్ విపత్కర సమయంలో ఓ ప్రవేట్ పాఠశాలలో యథేచ్ఛగా నూతన అడ్మిషన్లు జరుగుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఈ నెల 15 వరకు సెలవులు ప్రకటించింది. అయినప్పటికీ ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యా శాఖ అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే… పటాన్ చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ పంచాయతీ శివారులోని విజ్ఞాన్ పాఠశాలలో మంగళవారం యథేచ్ఛగా నూతన అడ్మిషన్లు కొనసాగిస్తున్నారు. దాంతో పాటు మరి కొంతమంది ఉపాధ్యాయులు ఏవో విధులు నిర్వహిస్తూ కనిపించారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మండల విద్యాశాఖ అధికారులు విద్యార్థుల వివరాలు ఆన్ లైన్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు సంబంధిత పాఠశాల ప్రిన్సిపల్ తనదైన శైలిలో మీడియాని నమ్మించడానికి ఎంతో ప్రయత్నం చేశారు.

లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి పాఠశాలను మూసి ఉంచామని, కేవలం ఈ రోజు మాత్రమే పాఠశాలను తెరిచామని ఆమె నమ్మబలికారు. కానీ ఓ పక్క నూతన అడ్మిషన్ జరుగుతున్నప్పటికీ, అవి కేవలం తమ మరో బ్రాంచ్ నుండి ఈ బ్రాంచ్ కి బదిలీ గురించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వచ్చారని సిబ్బంది చెప్పుకొచ్చారు. మీడియాని చూడగానే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను ఇంటికి పంపే ప్రయత్నం చేశారు. ఆ పాఠశాలకు చెందిన మేనేజర్ ఒకరు ఫోన్ లో మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాఠశాలకు పక్క జిల్లాకు చెందిన ఓ జిల్లా స్థాయి అధికారి వద్ద అనుమతి తీసుకున్నామని చెప్పుకొచ్చారు.

పాఠశాల యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వ లాక్ డౌన్ నిబంధనలను తుంగలో తొక్కడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఎంతో ప్రయత్నం చేశారు. ఈ విషయమై ఎంఈఓ పి.పి రాథోడ్ ను వివరణ కోరగా పాఠశాలలో తనిఖీ నిర్వహించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story

Most Viewed