నెటిజన్ల ఫైర్.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ‘తనిష్క్’!

by  |
నెటిజన్ల ఫైర్.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ‘తనిష్క్’!
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ 30 సెకన్ల యాడ్.. దర్శకుడి ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆ తక్కువ డ్యురేషన్‌లోనే ఆ ప్రొడక్ట్‌కు సంబంధించిన విషయాన్ని క్లియర్‌ కట్‌గా కస్టమర్‌కు కన్వే చేయగలగాలి. ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఆ యాడ్‌కు ఎంచుకున్న నేపథ్యం కూడా ఎంతో ముఖ్యం. అయితే తాజాగా ఓ యాడ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ సంస్థను బాయ్‌కాట్ చేయాలని కోరుతున్నారు. నెటిజన్లు అంతగా మండిపోవడానికి ఆ అందులో ఏముంది? ఇంతకీ ఆ యాడ్ ఏంటి?

భారతదేశం భిన్న మతాలకు పుట్టినిల్లే కాదు.. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నిలయం. ఈ అంశాలతో ఆయా ప్రజల మనోభావాలు ముడిపడి ఉంటాయి. ఇవి చాలా సున్నితమైన అంశాలు. ఇలాంటి అంశాలపై యాడ్ తీయాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎవరి మనోభావాలకు భంగం కలగకుండా చిత్రీకరించాల్సి ఉంటుంది. కానీ ప్రముఖ ఆభరణాల సంస్థ ‘తనిష్క్’ ఆ విషయంలో చిన్న పొరపాటు చేసింది. ‘ఏకత్వం’ పేరిట ప్రవేశపెట్టిన కొత్త కలెక్షన్‌ కోసం రూపొందించిన ప్రకటనే ఇందుకు కారణం. దాంతో నెటిజన్లు ఆ సంస్థ చిత్రీకరించిన సదరు యాడ్‌పై మండిపడుతున్నారు. ఏకంగా ఆ సంస్థ ఆభరణాలే కొనవద్దంటూ సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆ యాడ్‌లో ఏముందంటే..

‘హిందూ మహిళను తమ ఇంటికి కోడలిగా ఆహ్వానించిన ముస్లిం కుటుంబం, ఆమెకు సీమంతం నిర్వహించాలనుకుంటుంది. పుట్టింటి ప్రేమను తలపించేలా హిందూ సంప్రదాయం ప్రకారమే ఘనంగా వేడుక చేస్తుంది. అయితే దీని డిస్క్రిప్షన్‌గా.. ‘తమ సొంతబిడ్డలాగా ఆదరించే కుటుంబంలోకి ఆమె కోడలిగా వెళ్లింది. కేవలం ఆమె కోసమే వాళ్లు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈ వేడుక నిర్వహించారు. సాధారణంగా ఎవరూ ఇలా చేయరు. ఇది రెండు వేర్వేరు మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల అందమైన కలయిక’ అని తనిష్క్ ఇవ్వడంతో నెటిజన్ల మనోభావాలు దెబ్బతిన్నాయి..

‘తనిష్క్‌ను చూస్తే సిగ్గుగా ఉంది. తమ ప్రచారం కోసం ఇలాంటి అంశాన్ని ఎంచుకోవడం ఆపేయండి.. నిజాన్ని చూపండి, ఇది లవ్ జిహాదిని ప్రోత్సహించేలా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేయడంతో పాటు ఇక నుంచి తనిష్క్‌ ఆభరణాలను కొనే ప్రసక్తే లేదంటూ #BoycottTanishq హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. కొందరు మాత్రం ఈ ప్రకటనను అంతగా తప్పు పట్టాల్సిన అవసరం లేదని, మతసామరస్యం పెంపొందించేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు.


Next Story