UNOకు నేపాల్‌ కొత్త భౌగోళిక మ్యాప్‌

by  |
UNOకు నేపాల్‌ కొత్త భౌగోళిక మ్యాప్‌
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ చైనాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న కొద్దిరోజుల వ్యవధిలోనే మనదేశానికి వ్యతిరేకంగానేపాల్‌ దుందుడుకు చర్యలు ప్రారంభించింది. తాజాగా ఆ దేశం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలు తమవేనంటూ రూపొందించిన నూతన మ్యాప్‌ను నేపాల్‌.. ఐక్యరాజ్యసమితి, గూగుల్‌కు పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆ దేశ మీడియా శనివారం ప్రకటించింది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం మ్యాప్‌ను ఆంగ్లంలో ప్రచురించడంతో పాటు ఐక్యరాజ్యసమితి, గూగుల్‌తో సహా అంతర్జాతీయ సమాజానికి పంపడానికి అవసరమైన సన్నాహాలు చేస్తోందని సమాచారం.

ఈ సందర్భంగా ‘మేము త్వరలో లిపులేఖ్, కాలాపానీ, లింపియధురలతో ఉన్న మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపిస్తాము’ అని నేపాల్‌ మంత్రి పద్మ ఆర్యాల్‌ తెలిపారు. అంతేకాక ‘ఆక్రమిత భూభాగాలతో’ అనే పేరుతో ఈ మూడు భూభాగాలకు సంబంధించి ఒక పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా నేపాల్ ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పద్మ ఆర్యాల్ తెలిపారు. అయితే, ఈ నూతన మ్యాప్‌ను అంతర్జాతీయ సమాజానికి పంపడమే తమ మొదటి ప్రాధాన్యత అన్నారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను తమ దేశ అంతర్భాగంలో చేర్చిన మ్యాప్‌ను జూన్‌ 13న నేపాల్‌ పార్లమెంట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మూడు ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్‌ స్పష్టంచేసింది.



Next Story