నత్తలకే నడక నేర్పుతున్నారా?

by  |
నత్తలకే నడక నేర్పుతున్నారా?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : 2016 మే 2వ తేదీన రాష్ట్రంలోని రైతులతో పాటు భక్తజనం కూడా పులకరించి పోయారు. రెండు చారిత్రాత్మక నిర్ణయాలకు ఆ రోజున బీజం పడడమే ఇందుకు ప్రధాన కారణం. బీడు భూములకు నీరందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయగా, దేశంలోనే అత్యంత అరుదైన త్రివేణి సంగమ క్షేత్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు మంజూరు చేశారు. అరుదైన మొదటి నుంచి వివక్షకు గురైన కాళేశ్వరం త్రిలింగ క్షేత్రం సీఎం ప్రకటనతో దశ మారుతుందని అందరూ భావించారు. కానీ ముఖ్యమంత్రి ఆలోచనలకు తగ్గట్టు అధికారులు పని చేయడం లేదు. ఎందుకంటే సీఎం మొదట మంజూరు చేసిన రూ.25 కోట్ల నిధులతో చేపట్టిన నిర్మాణాలు నాలుగేళ్లు దాటినా పూర్తి కాకపోవడమే అందుకు నిదర్శనం. పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ చేపట్టిన వంద గదుల భవనం, అన్నదానం చేసేందుకు బిల్డింగ్ లూ నిర్మాణ దశల్లోనే ఉన్నాయి. భక్తులు సేద తీరేందుకు నిర్మించాల్సిన డార్మెటరీ హాల్ పునాదుల కోసం కనీసం కందకాలు తవ్వలేదు.

వంద కోట్ల మాటేమిటో..

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం మరోసారి కాళేశ్వరంపై మమకారం చూపించారు. క్షేత్రంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు మరో వంద కోట్ల రూపాయలను మంజూరు చేశారు. 2019 జూన్ 21 సీఎం ఈ ప్రకటన చేశారు. ఇప్పటికీ ఆ నిధులను ఏ పనులకు వినియోగించాలో నిర్ణయమే జరగకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇటీవల జిల్లా యంత్రాంగం సమీక్ష సమావేశం జరిపి కొన్ని పనులు చేపట్టాలని ప్రతిపాదనలు తయారు చేశారు. ఏడాదిన్నర కిందట ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన నిధులను ఖర్చు చేసేందుకు అధికారులు తాత్సరం చేస్తున్నారంటే ఆలయంపై యంత్రాంగం ఎంతటి నిర్లక్ష్యం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపున కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శకుల తాకిడి, మరోవైపు అంతర్రాష్ర్ట వంతెన కారణంగా క్షేత్రానికి భక్తుల తాకిడి గణనీయంగా పెరుగుతోంది. రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం పర్యటన నేపథ్యంలో ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఓ కన్నేస్తే బాగుంటుందని భక్తులు, స్థానికులు అంటున్నారు.


Next Story