నెగెటివ్ రోల్‌లో నయన్ ?

by  |
నెగెటివ్ రోల్‌లో నయన్ ?
X

దిశ, వెబ్ డెస్క్: ‘భీష్మ’ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న నితిన్ ప్రస్తుతం ‘రంగ్ దే’ సినిమా చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్. ఈ చిత్రం తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టాడు హీరో నితిన్. ఒకటి చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమా కాగా, మరొకటి బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ‘అంధాదున్’ సినిమాలో హిందీలో ఆయుష్మాన్ ఖురానా పోషించిన పాత్రలో నితిన్ నటిస్తుండగా.. కీలకమైన టబు పాత్ర కోసం దర్శక నిర్మాతలు వేట మొదలుపెట్టారు. ఈ జాబితాలో చాలా మంది పేర్లే ఉన్నాయి. ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్‌ను ఆ రోల్ కోసం మూవీ యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది.

‘అంధాదున్’ సినిమాలో కీలక పాత్రలుగా చెప్పుకోవాల్సింది రెండే. ఒకటి హీరో ఆయుష్మాన్ ఖురానా పాత్ర కాగా, రెండు టబు రోల్. నెగెటివ్ షేడ్స్‌ ఉన్న ఈ పాత్రలో టబు చాలా బాగా నటించింది. అందుకే టబు రోల్ కోసం ఈ చిత్ర యూనిట్ అంతగా శ్రద్ధ తీసుకుంటున్నారు. మరొకరు అయితే, ఈ పాత్రకు న్యాయం చేస్తారో లేదో అని.. మొదట ఈ పాత్రను.. టబునే చేయమని అడిగారని సమాచారం. కానీ, ఆమె ఒప్పుకోలేదట. ఆ తర్వాత చిత్ర యూనిట్ మరికొందరి పేర్లను పరిశీలించింది. అందులో భాగంగా రమ్యకృష్ణ, అనసూయ, ఇలియానాలను సంప్రదించారని టాక్. అయితే, వీళ్లందరూ ఈ పాత్ర చేయడానికి నో చెప్పారని తెలుస్తోంది.

తాజాగా ఈ ఆఫర్ స్టార్ హీరోయిన్ నయనతారను చేరింది. ఓ వైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే మరోవైపు నటనా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్‌ను అందంగా మలుచుకుంటోంది నయన్. టబు పాత్రను చేసేందుకు నయన్ ఒప్పుకున్నట్లు సమాచారం. కానీ, ఈ రోల్ కోసం ఆమె చాలా ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అడిగినట్లు తెలుస్తోంది. నయన్ డీల్‌కు ఫిల్మ్ మేకర్స్ ఒప్పుకుంటారా? లేదా? అన్నది తెలియాలి. ఈ రిమేక్ నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ ఫిలింస్ నిర్మిస్తొంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం పూజను అడగగా, పూజ హెగ్డే కూడా నిరాకరించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. నితిన్ పక్కన నటించే హీరోయిన్ ఎవరనేది చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు.



Next Story

Most Viewed