- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Zelensky: వారికి సొంత సైన్యం అవసరం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
యూరోపియన్ యూనియన్ సాయుధ దళాలను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: యూరోపియన్ యూనియన్ సాయుధ దళాలను ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) అన్నారు. కూటమి నాయకులు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని తెలిపారు. రష్యాపై తమ దేశం చేస్తున్న పోరాటమే దీనికి ఉదాహరణ అని చెప్పారు. జర్మనీలో జరిగిన మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్సు (Munich security confarance) లో భాగంగా ఆయన ప్రసంగించారు. అమెరికా యూరప్‌కు సహాయం చేయడానికి నిరాకరించే అవకాశాలను సైతం తోసిపుచ్చలేమన్నారు. కాబట్టి యూరప్‌కు సొంత సైన్యం అవసరమని చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారని, ఇప్పుడు ఆ టైం వచ్చిందని నొక్కి చెప్పారు. రష్యా శాంతిని కోరుకునే దేశం కాదని చర్చలకు సిద్ధపడటం లేదని వెల్లడించారు.
శిక్షణా విన్యాసాల సాకుతో రష్యా తన మిత్రదేశమైన బెలారస్‌కు సైన్యాన్ని పంపాలని యోచిస్తోందని, ఇది నాటో దేశాలకు ప్రమాదమని హెచ్చరించారు. ఉక్రెయిన్ నాటోలో చేరడంలో విఫలమైతే దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాల్సి ఉంటుందన్నారు. అమెరికా సైనిక మద్దతు లేకుండా తమ దేశం రష్యాను ఎదుర్కోలేదని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు సైనిక సహాయాన్ని అపివేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలిపారు. అయితే ఉక్రెయిన్ తన ప్రమేయం లేకుండా కుదిరిన ఎటువంటి శాంతి ఒప్పందాన్ని కూడా అంగీకరించబోదన్నారు. పుతిన్‌తో శాంతి చర్చలపై చర్చించే ముందు డొనాల్డ్ ట్రంప్ తనతో మాట్లాడకపోవడం పట్ల తాను అసంతృప్తితో ఉన్నానన్నారు.
కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్ స్కీలతో ఫోన్‌లో మాట్లాడారు. చర్చలు జరిపేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని చెప్పిన ట్రంప్ ఉక్రెయిన్ కు మాత్రం నాటో సభ్యత్వం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ వ్యా్ఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అమెరికా తీరుపై ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ నాటోలోనే చేరాలని తెలిపింది. ఈ డిమాండ్ ను ఉక్రెయిన్ విడిచిపెట్టొద్దని స్పష్టం చేసింది.






