Bangladesh: రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత

by Shamantha N |

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో రాజకీయ అస్థిరత్వం కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని పదవి నుంచి షేక్‌ హసీనా దిగిపోయినత తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) బాధ్యతలు చేపట్టారు.

Bangladesh: రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో రాజకీయ అస్థిరత్వం కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని పదవి నుంచి షేక్‌ హసీనా దిగిపోయినత తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన తన పదవికి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దేశంలోని రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరుక స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా.. నేషనల్‌ సిటిజన్‌ పార్టీ (NCP) చీఫ్‌ నహిద్‌ ఇస్లామ్‌, యూనస్‌ రాజీనామా గురించి మీడియాతో మాట్లాడారు. ‘యూనస్‌ రాజీనామా గురించి వచ్చిన వార్తలు నేను విన్నాను. దానిపై చర్చించేందుకు ఆయన్ను కలిశాను. రాజీనామా గురించే ఆలోచిస్తున్నానని యూనస్‌ నాతో చెప్పారు. దేశంలోని రాజకీయ పార్టీలు ఐక్యంగా లేకపోతే తాను పనిచేయలేనని ఆయన వెల్లడించారు. దేశ భద్రత, భవిష్యత్తు కోసం బలంగా ఉండాలని నేను ఆయనకు చెప్పాను. పార్టీలన్నీ ఐక్యంగా ఉండి ఆయనకు సహకరిస్తాయని ఆశిస్తున్నా. పార్టీలకు ఆయనపై విశ్వసనీయత లేనప్పుడు యూనస్‌ పదవిలో ఎలా కొనసాగుతారు?’ అని నహిద్‌ పేర్కొన్నారు. "నన్ను బందీగా ఉంచారు... నేను ఇలా పని చేయలేను. అన్ని రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరదా?" అని యూనస్ చెప్పినట్లు నహిద్ ఇస్లాం ఉటంకించారు.

యూనస్ ప్రభుత్వం..

ఇటీవల యూనస్‌ ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో బంగ్లా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకార్- ఉజ్‌- జమాన్‌ (Waker-Uz-Zaman)తో నెలకొన్న విభేదాలు ముఖ్యమైనవి. హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ.. ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్‌ తీసుకొంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. 2026 జూన్‌లో ఎన్నికలు జరుగుతాయని యూనస్‌ పేర్కొనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈక్రమంలోనే ఎన్నికల నిర్వహణపై ఇటీవల వకార్‌ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తాత్కాలిక ప్రభుత్వానికి తెలిపారు. ఈ సందర్భంగా సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపైనా ఆయన అభ్యంతరం తెలిపారు.

ఎన్నికల నిర్వహణపై..

కాగా.. ఎన్నికల నిర్వహణపై యూనస్ ప్రకటన వెలువడటంతోనే బంగ్లాలోని రాజకీయ పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) గురువారం నిరసన చేపట్టింది. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ కూడా బుధవారం యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం డిసెంబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు, విద్యార్థి నాయకులు, ఇస్లామిస్టులు యూనస్ కు మద్దతు తెలుపుతన్నారు. ఢాకాలో నిరసన తెలిపేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత ఆర్మీ కంటోన్మెంట్‌కు ర్యాలీగా తరలివెళ్తారని సమాచారం. కాగా.. యూనస్ విద్యార్థులను, ఇస్లామిస్ట్ మూకలను తన కాపలా సైనికులుగా ఉపయోగించుకుంటున్నాడని కొందరు అంటున్నారు. ఎన్నికలు నిర్వహించకుండా అధికారంలో ఉండటానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇకపోతే, పదహారేళ్లపాటు కొనసాగిన షేక్‌ హసీనా ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం వల్ల పతనమైంది. దీంతో పదవీచ్యుతురాలైన ఆమె.. స్వదేశాన్ని వీడి భారత్‌కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు.

Next Story