- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర ప్రమాదం.. జల బోర్డు నిర్లక్ష్యానికి యువకుడు బలి! ముగ్గురు అధికారులపై వేటు
దేశ రాజధానిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ జల బోర్డు చేపట్టిన పనుల కోసం తవ్విన గుంత ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధానిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ జల బోర్డు (DJB) చేపట్టిన పనుల కోసం తవ్విన గుంత ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రోహిణిలోని తన కార్యాలయం నుండి ఇంటికి తిరిగి వస్తున్న 25 ఏళ్ల కమల్ ధ్యాని అనే యువకుడు, రక్షణ చర్యలు లేని 15 అడుగుల లోతు గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కైలాష్‌పురి నివాసి అయిన కమల్ ధ్యాని బుధవారం రాత్రి తన కార్యాలయం నుండి బయలుదేరాడు. ఎంతసేపటికీ అతను ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి గాలింపు చేపట్టారు. జనకపురి, సాగర్ పూర్, వికాస్ పురి, రోహిణి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది.
తెల్లవారుజామున వెలుగుచూసిన విషాదం..
పోలీసుల కథనం ప్రకారం, తెల్లవారుజామున 2:45 గంటలకు ఫిర్యాదు అందగానే హెడ్ కానిస్టేబుల్ రామ్ కేష్ కుటుంబ సభ్యులతో కలిసి గాలింపులో పాల్గొన్నారు. మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా వెతికినప్పటికీ, సరిగ్గా ఎక్కడ ఉన్నాడో గుర్తించడం సవాలుగా మారింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఒక మహిళ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 అడుగుల లోతైన గుంతలో కమల్ మృతదేహంతో పాటు అతని బైక్ కూడా పడి ఉండటాన్ని గుర్తించారు. ఢిల్లీ జల బోర్డు పనుల కోసం తవ్విన ఈ గుంత చుట్టూ ఎలాంటి రక్షణ కంచె (Barricades) లేకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
రాజకీయ దుమారం - అధికారులపై వేటు..
ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బీజేపీ మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. 8 నెలలుగా పనులు జరుగుతున్నా భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని వార్డ్ 100 కౌన్సిలర్ రమీందర్ కౌర్ ఆరోపించారు. చీకటిగా ఉన్న ఆ ప్రాంతంలో కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆశిష్ సూద్ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం ముగ్గురు ఢిల్లీ జల బోర్డు అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు మాత్రం ఇది కేవలం ప్రమాదం కాకపోవచ్చని, ఎవరైనా తోసివేసి ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఢిల్లీ జల బోర్డు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని, గుంతలు ఉన్నా ప్రాంతాల గురించి 1916 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరింది.






