'మీ డబ్బు.. మీ హక్కు' పథకం.. రూ. 2,000 కోట్లు తిరిగిచ్చిన ప్రభుత్వం

by Malleboina Mahesh |   (  Updated:2025-12-10 06:53:04  IST  )

దేశ పౌరులు మరచిపోయిన తమ ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేందుకు 2025 అక్టోబర్‌లో ప్రభుత్వం 'మీ డబ్బు, మీ హక్కు' (Your Money, Your Right) పథకం ప్రారంభించింది.

మీ డబ్బు.. మీ హక్కు పథకం.. రూ. 2,000 కోట్లు తిరిగిచ్చిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: దేశ పౌరులు మరచిపోయిన తమ ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేందుకు 2025 అక్టోబర్‌లో ప్రభుత్వం 'మీ డబ్బు, మీ హక్కు' (Your Money, Your Right) పథకం ప్రారంభించింది. దీని ద్వారా ఇప్పటివరకు దాదాపు రూ. 2,000 కోట్లను అసలైన యజమానులకు తిరిగి అప్పగించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ప్రతి పౌరుడు చట్టబద్ధంగా తమకు దక్కాల్సిన ఆస్తులను తిరిగి పొందే లక్ష్యంతో ఈ ఉద్యమం ప్రారంభమైందని ప్రధాని మోడీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. "మరచిపోయిన ఆర్థిక ఆస్తిని కొత్త అవకాశంగా మార్చుకునే అవకాశం ఇది. 'మీ డబ్బు, మీ హక్కు' ఉద్యమంలో పాల్గొనండి!" అని మోడీ పిలుపునిచ్చారు.

దేశంలోని వివిధ ఆర్థిక సంస్థలలో రూ. 78,000 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు, రూ. 14,000 కోట్ల బీమా సొమ్ములు, రూ. 3,000 కోట్ల మ్యూచువల్ ఫండ్స్, రూ. 9,000 కోట్ల డివిడెండ్లు సహా పెద్ద మొత్తంలో ప్రజా ధనం క్లెయిమ్ చేయకుండా మిగిలి ఉందని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ క్లెయిమ్ ప్రక్రియను సరళంగా, పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు కలిసి ప్రత్యేక పోర్టళ్లను (RBI - UDGAM, IRDAI - Bima Bharosa, SEBI - MITRA, MCA - IEPFA) ఏర్పాటు చేశాయి. పౌరులు తమ నిధులను ట్రాక్ చేసి క్లెయిమ్ చేసుకోవడానికి ఈ పోర్టళ్లు ఉపయోగపడతాయి.

గరిష్ట కవరేజ్, అందుబాటు కోసం దేశంలోని 477 జిల్లాల్లో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో, సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాని తెలిపారు. ఇప్పటివరకు రూ. 2,000 కోట్లను పౌరులకు అందించడంలో ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, బ్యాంకులు సమన్వయంతో కృషి చేశాయి. ప్రధాని మోడీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, వారు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన క్లెయిమ్ చేయని డిపాజిట్లు, పెట్టుబడులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలని, తక్షణమే ఈ పోర్టళ్లను ఉపయోగించి తమకు చెందాల్సిన సొమ్మును తిరిగి పొందాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలకు రిక్వెస్ట్ చేశారు.

Next Story