UN: ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని మీ మంత్రే చెప్పారు- యూఎన్ వేదికగా పాక్ పై భారత్ మండిపాటు

by Shamantha N |

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ పై భారత్ విమర్శలు గుప్పించింది. పహెల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ దాయాదిని ఎండగట్టింది. న్యూయార్క్‌లో ‘ఉగ్రవాద అనుబంధ నెట్‌వర్క్‌ బాధితుల’ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్‌ పాల్గొన్నారు.

UN: ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని మీ మంత్రే చెప్పారు- యూఎన్ వేదికగా పాక్ పై భారత్ మండిపాటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ పై భారత్ విమర్శలు గుప్పించింది. పహెల్గాం ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ దాయాదిని ఎండగట్టింది. న్యూయార్క్‌లో ‘ఉగ్రవాద అనుబంధ నెట్‌వర్క్‌ బాధితుల’ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితిలో భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పహల్గాం దాడి (Pahalgam Terror Attack) ఘటనను ప్రస్తావిస్తూ పాక్‌ను దుయ్యబట్టారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్ మంత్రే బయటపెట్టిని విషయాన్ని గుర్తుచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్‌లో హింసకు పాల్పడుతుందని మండిపడింది. యోజన పటేల్ మాట్లాడుతూ.. ‘‘సీమాంతర ఉగ్రవాదానికి కొన్ని దశాబ్దాలుగా మేం బాధితులం. ఉగ్ర చర్యల వల్ల బాధితులు, వారి కుటుంబాలతో పాటు సమాజంపై ఎలాంటి దీర్ఘకాల ప్రభావం ఉంటుందో మాకు తెలుసు. ముష్కరులకు శిక్షణ ఇస్తున్నామని, ఉగ్ర సంస్థలకు నిధులు సమీకరిస్తున్నామని ఇటీవలే పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్‌ చెప్పిన మాటలను ప్రపంచమంతా విన్నది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని వారు బహిరంగంగా అంగకరించినా.. ఎవరూ ఆశ్చర్యపోలేదు. పాక్‌ ఎలాంటి మోసపూరిత దేశమో దీన్ని బట్టి మరోసారి స్పష్టమైంది. ఆ దేశం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకుని కూర్చోదు’’ అని ఆమె హెచ్చరించారు. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడానికి అంతర్జాతీయ వేదికను పాక్‌ దుర్వినియోగం చేస్తోందని పటేల్‌ మండిపడ్డారు. పహెల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజం ఎన్నటికీ అంగీకరించబోదని.. అన్ని దేశాలు భారత్ కు మద్దతు పలికాయని పేర్కొన్నారు.

పహెల్గాం ఉగ్రదాడిని ఖండించిన భద్రతా మండలి

మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పహెల్గాం ఉగ్రవాద దాడిని ఖండించింది. ఉగ్రదాడికి బాధ్యులు జవాబుదారీగా ఉంచాలని నొక్కి చెప్పింది. " ఉగ్రదాడి ఖండించదగిన చర్య. నిర్వాహకులు, ఆర్థిక సహాయం చేసేవారు. స్పాన్సర్లను కఠినంగా శిక్షించాలి" అని కోరింది. ఏప్రిల్ 22న పహెల్గాంలో పర్యాటకులపై ముష్కరులు కాల్పులు జరిపారు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రతినిధి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అప్పట్నుంచి భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి.

Next Story