సిగ్గుపడాలి..కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్

by Phanindra |

కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్ అయింది. ఈ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత సిగ్గుపడాలని వ్యాఖ్యానించింది.

సిగ్గుపడాలి..కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్మీ అధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు సిగ్గుతో తలవంచుకునేలా ఉన్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. తన వ్యాఖ్యలక క్షమాపణ కోరుతూ విజయ్ షా విడుదల చేసిన వీడియోను జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. అతని క్షమాపణలో నిజాయితీ లేదని పేర్కొంది.

‘మీ వ్యాఖ్యల వల్ల దేశం అంతా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. మీ వీడియోలను చూశాం. చాలా నీచమైన పదజాలాన్ని ఉపయోగించేలా కనిపించారు. కానీ చివరకు మీ బుద్ధి వల్లనో లేక సరైన పదాలు దొరక్కపోవడం వల్లనో ఆగిపోయారు. ఇలా మాట్లాడినందుకు మీరు సిగ్గుపడాలి. ఆర్మీని చూసి దేశమంతా గర్విస్తు్న్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు’ అని జస్టిస్ కాంత్ విమర్శించారు. ఇక విజయ్ షా క్షమాపణ చెప్పిన వీడియోపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘ఇదేం క్షమాపణ? జస్ట్ మీ తప్పును ఒప్పుకొని క్షమాపణ అడిగితే సరిపోయేది. కానీ ‘ఒకవేళ’, ‘అదీ ఇదీ’ అంటూ ఏదేదో చెప్పి, చివరకు క్షమాపణ చెప్పారు. ఎవరినైనా క్షమాపణ అడిగే పద్ధతి ఇది కాదు’ అని జస్టిస్ కాంత్ తేల్చిచెప్పారు. అలాగే ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఐజీ స్థాయి ఆఫీసర్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని కోర్టు ఆదేశించింది. ఈ సిట్‌లో కనీసం ఒక మహిళా ఆఫీసర్ ఉండాలని షరతు విధించింది. మంగళవారం ఉదయం 10 గంటల్లోగా సిట్ ఏర్పాటు చేయాలని, వాళ్లు మే 28లోగా తొలి రిపోర్టును తమ ముందుంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Next Story