వెనిజులా- అమెరికా చర్యతో ప్రపంచానికి పెను ముప్పు!

by Phanindra |

వెనిజులాపై అమెరికా చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాయి.

వెనిజులా- అమెరికా చర్యతో ప్రపంచానికి పెను ముప్పు!
X

దిశ, నేషనల్ బ్యూరో: వెనిజులాపై అమెరికా చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిణామాలపై ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరుతున్నాయి. అమెరికా తన దాడులను కొనసాగిస్తే.. వెనిజులాకు మద్దతుగా పలు దేశాలు రంగంలోకి దిగే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రపంచం పెను సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్, అర్జెంటీనా వంటి దేశాలు మాత్రం వెనిజులాకు షాక్ ఇచ్చాయి. మదురో పాలన దేశంలో అన్ని విధాల హక్కులను అణిచివేసిందని, అందుకే ఈ అంశంపై తాము స్పందించలేమని స్పష్టం చేశాయి.

రష్యా..
వెనిజులా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తే తాము మౌనంగా ఉండమని రష్యా హెచ్చరించింది. మిత్రదేశాన్ని ఒంటరి చేయబోమని స్పష్టం చేసింది. వెనిజులా వద్ద ఉన్న తమ S-300 క్షిపణి వ్యవస్థలు అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. పరిస్థితి మరింత దిగజారకుండా సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. వెనిజులా ప్రజలకు, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని, ఈ విషయమై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని రష్యా విదేశాంగశాఖ డిమాండు చేసింది.

చైనా..
వెనిజులా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంపై చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని చైనా హెచ్చరించింది. వెనిజులా చైనాకు కీలక చమురు సరఫరాదారు. కాగా ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర ఆర్థిక, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.

బ్రిటన్‌ ..
వెనిజులాపై ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌తో బ్రిటన్‌కు సంబంధం లేదని ప్రధాని కీర్‌ స్టార్మర్‌ స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ట్రంప్‌ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటామన్నారు. అంతర్జాతీయ చట్టాలను సమర్థించడాన్ని తాము విశ్వసిస్తామని తెలిపారు.

స్పెయిన్‌..
అమెరికా- వెనిజులా ఉద్రిక్తతలను తగ్గించాలని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ సూచించారు. ఇరు దేశాలు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అంతర్జాతీయ చట్టాలను, ఐరాస చార్టర్‌ను గౌరవించాలని సూచించారు.

ఐక్యరాజ్యసమితి..
అమెరికా, వెనిజులా దేశాల మధ్య నెలకొన్న పరిణామాలపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. ఒకవేళ అమెరికా తన దాడులను కొనసాగిస్తే.. రష్యా, చైనా నేరుగా వెనిజులాకు మద్దతుగా రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలిపింది. అదే జరిగితే ఇది ప్రపంచాన్ని ఒక పెను సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఐరోపా కూటమి..
వెనిజులా- అమెరికా ఉద్రిక్త వాతావరణంపై శాంతియుత, ప్రజాస్వామ్యయుత, సమ్మిళిత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని ఐరోపా కూటమి అధ్యక్షులు ఆంటోనియో కోస్టా చెప్పారు. ప్రజాస్వామిక మార్పు కోసం వెనిజులా ప్రజలకు మద్ధతుగా నిలుస్తామని ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్‌ లెయెన్‌ తెలిపారు.

క్యూబా..
వెనిజులాపై అమెరికా దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలని క్యూబా కోరింది. తమ ప్రాంతంలో శాంతిని అమెరికా దారుణంగా భగ్నం చేసిందని క్యూబా దేశాధ్యక్షుడు మిగెల్‌ డియాజ్‌-కానెల్‌ బెర్ముడెజ్‌ మండిపడ్డారు. ఇది ముమ్మాటికి నేరపూరిత దాడేనని అన్నారు.

కొలంబియా..
వెనిజులాపై ట్రంప్ చర్యల నేపథ్యంలో తమ దేశ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నామని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో చెప్పారు.ఓఏఎస్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ స్టేట్స్‌), ఐక్యరాజ్య సమితిని వెంటనే సమావేశం కావాలని కోరారు.

చిలీ..
వెనిజులాపై అమెరికా చేసిన దాడి కలవరపెడుతోందని చిలీ అధ్యక్షుడు గాబ్రియల్‌ బోరిక్‌ అన్నారు. ట్రంప్ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఉక్రెయిన్..
వెనిజులా ప్రజలకు సాధారణ జీవితం, భద్రత, శ్రేయస్సు, గౌరవం పొందే అవకాశం ఉండాలని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా కోరారు. అయితే మదురో పాలన అన్ని విధాల హక్కులను అణిచివేసిందని, ఎన్నికల రిగ్గింగ్, నిరసనకారులపై హింసకు పాల్పడినందుకు తాము మదురో ప్రభుత్వ చట్టబద్ధతను గుర్తించలేమని పేర్కొంది.

అర్జెంటీనా..
వెనిజులాపై అమెరికా దాడులను అర్జెంటీనా సమర్ధించింది. అధ్యక్షుడు జేవియర్‌ మిలే ‘లాంగ్‌ లివ్‌ ఫ్రీడం’ అన్నారు. అర్జెంటీనా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో మాత్రం దాడులపై స్పందించేందుకు నిరాకరించారు.

Next Story