- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం.. మట్టి కింద కూరుకుపోయి కార్మికుడు సజీవ సమాధి..! సీఎం యోగి కీలక ఆదేశాలు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మురుగునీటి పైప్‌లైన్ మరమ్మతులు చేస్తుండగా గుంతలో మట్టిపెళ్లలు విరిగిపడి మహేంద్ర (32) అనే దినసరి కార్మికుడు సజీవ సమాధి అయ్యాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మురుగునీటి పైప్‌లైన్ మరమ్మతులు చేస్తుండగా గుంతలో మట్టిపెళ్లలు విరిగిపడి మహేంద్ర (32) అనే దినసరి కార్మికుడు సజీవ సమాధి అయ్యాడు. అక్కడున్న జూనియర్ ఇంజనీర్ (జేఈ) బలవంతంగా గుంతలోకి నెట్టడం వల్లే ఈ దారుణం జరిగిందని మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అలీగఢ్‌లోని రైల్వే రోడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం పైప్‌లైన్ మరమ్మతుల కోసం 14 అడుగుల లోతైన గుంతను తవ్వారు. మరమ్మతులు చేయడానికి మహేంద్ర గుంతలోకి దిగగా, ఒక్కసారిగా పైనున్న మట్టి అతనిపై కుప్పకూలింది. తోటి కార్మికులు వెంటనే జేసీబీ సాయంతో మట్టిని తొలగించి అతడిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మహేంద్ర చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కుటుంబ సభ్యుల ఆరోపణలు..
ప్రమాద సమయంలో అక్కడే ఉన్న మృతుడి సోదరుడు రాజ్‌కుమార్ జేఈ నరేంద్ర సింగ్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. మట్టి వదులుగా ఉండి పడిపోతోందని, ప్రాణాపాయం ఉందని ప్రాధేయపడినా జేఈ వినలేదని ఆరోపించారు. విధులకు ఎగనామం పెడుతున్నారంటూ దూషించి, తన సోదరుడిని కాలితో తన్ని మరీ బలవంతంగా గుంతలోకి నెట్టాడని, ఎలాంటి భద్రతా పరికరాలు కూడా ఇవ్వలేదని ఆరోపించాడు. ప్రమాదం జరిగిన వెంటనే జేఈ అక్కడి నుంచి పరారైనట్లు తెలిపారు.
ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత - పరిహారం డిమాండ్
మహేంద్ర మృతితో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పోలీసుల నుంచి మృతదేహాన్ని లాగేసుకుని దాదాపు గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. నిందితుడైన జేఈపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరు పిల్లలున్న తన కుటుంబానికి న్యాయం చేయాలని, రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని మృతుడి భార్య భారతి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఎస్పీ ఆదిత్య బన్సాల్ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆరోపణలను మున్సిపల్ కమిషనర్ ప్రేమ్ ప్రకాష్ మీనా ఖండించారు. భద్రతా ప్రమాణాలన్నీ పాటించామని పేర్కొన్నారు. ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించామని, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని, కాంట్రాక్టర్ ద్వారా కూడా సాయం అందేలా చూస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సమగ్ర విచారణకు ఆదేశించారు.






