- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బోరుబావికి ‘అంత్యక్రియలు’.. అధికారుల నిర్లక్ష్యంపై మహిళల వినూత్న నిరసన!
గత మూడేళ్లుగా చుక్క నీరు రాకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన మహిళలు ఓ వినూత్న నిరసనకు దిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో: గత మూడేళ్లుగా చుక్క నీరు రాకపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగెత్తిన మహిళలు ఓ వినూత్న నిరసనకు దిగారు. ఏకంగా ఆ బోరుబావికి పూలమాలలు వేసి, గట్టిగా విలపిస్తూ ‘అంత్యక్రియలు’ నిర్వహించారు. ఈ వింత, విషాదకర ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. పుదుక్కొట్టై జిల్లా, గంధర్వకోట్టై సమీపంలోని ఎల్లైత్తరప్పట్టి గ్రామంలో ఓ బోరుబావి గత మూడు సంవత్సరాలుగా నిరుపయోగంగా పడి ఉందని, అందులో నుంచి నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు కనీసం పట్టించుకోలేదని మహిళలు ఆరోపించారు. దీంతో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర అసహనానికి గురైన ఆ గ్రామ మహిళలు, ఆదివారం నాడు బోరుబావి వద్దకు చేరుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాడుబడిన ఆ బోరుబావికి పూలమాలలు వేసి, తాగునీటి కోసం శోకిస్తూ దానికి ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు నిర్వహించారు.
5 కిలోమీటర్ల నడక..
ఈ బోరుబావి పనిచేయని కారణంగా తాము రోజూ తాగునీటి కోసం 5 కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బిందెలతో నిత్యం అంత దూరం వెళ్లి రావడం వల్ల తమ రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, అలాగే తమ పిల్లల చదువులపైనా ఈ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వారు వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరిచి, తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని మహిళలు తీవ్రంగా హెచ్చరించారు.






