Pahalgam: మహిళలు బతిమాలకుండా.. పోరాడితే బాగుండేది.. పహెల్గాం ఉగ్రదాడిపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశఆరు. తమ భర్తల ప్రాణాల కోసం ముష్కరులను బతిమాలడానికి బదులుగా వారితో పోరాడితే బాగుండేదని అన్నారు.

Pahalgam: మహిళలు బతిమాలకుండా.. పోరాడితే బాగుండేది.. పహెల్గాం ఉగ్రదాడిపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళలపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ భర్తల ప్రాణాల కోసం ముష్కరులను బతిమాలడానికి బదులుగా వారితో పోరాడితే బాగుండేదని అన్నారు. హర్యానాలోని భివానీలో దేవి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి కార్యక్రమం జరిగింది. కాగా.. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు రామచందర్ జంగ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పహెల్గాం ఉగ్రదాడి గురించి ప్రసంగించారు. రామచందర్ జంగ్రా మాట్లాడుతూ.. ‘పహెల్గాంలో భర్తలను కోల్పోయిన మహిళలకు యోధ స్ఫూర్తి, తెగింపు చూపలేదు. అందుకే వారు దాడికి బాధితులయ్యారు. చేతులు జోడించి బతిమాలితే ఉగ్రవాదులు వినే రకం కాదు. కానీ, మనవారు చేతులు జోడించుకునే చనిపోయారు. పర్యాటకులు అగ్నిపథ్ శిక్షణలో ఉత్తీర్ణులై ఉంటే.. కేవలం ముగ్గురు ఉగ్రవాదులు 26 మందిని చంపకపోయే వారు. టూరిస్టులు పోరాడి ఉంటే, ప్రాణనష్టం తక్కువగా ఉండేది." అని అన్నారు. ఉగ్రవాదులపై మహిళలు ఎలా పోరాడతారని తరువాత అడిగిన ప్రశ్నకు ఎంపీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "అహిల్యాబాయి హోల్కర్, రాణి లక్ష్మీబాయి వీరంతా మహిళలే. వారు పోరాడలేదా? మన సోదరీమణులు ధైర్యంగా ఉండాలని, ధైర్యంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము" అని అన్నారు.

కాంగ్రెస్ విమర్శలు

కాగా, ఉగ్రవాద బాధితుల పట్ల సానుభూతి లేకుండా చేసిన రాజ్యసభ ఎంపీ చేసిన వ్యాఖ్యల పట్ల రాజకీయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ వ్యాఖ్యలు "సిగ్గుచేటని" కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేష్ అన్నారు. రామచందర్ జంగ్రా వీడియో పంచుకుంటా.. "రాజ్యసభ ఎంపీది సిగ్గుచేటు ప్రకటన. అధికారం మత్తులో ఉన్న బీజేపీ చాలా అసభ్యకరంగా మారిందని ఈ వీడియో చూపిస్తుంది. పహెల్గామ్ ఉగ్రదాడిలో అమరులైన వారి త్యాగానికి భద్రతా లోపాన్ని నిందించడానికి బదులుగా, బీజేపీ ఎంపీలు అమరవీరులు, వారి భార్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు." అని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతకరమైనవని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా చీఫ్‌ సుప్రియా శ్రీనాథె బీజేపీ ఎంపీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పెహల్గాం ఉగ్రదాడిలో తమ భర్తలను కోల్పోయిన మహిళల గురించి బీజేపీ ఎంపీ రామచంద్ర జంగ్రా చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. సిగ్గులేనితనానికి కూడా ఓ పరిమితి ఉంటుందని చురకలు అంటించారు.

Next Story