అప్పు చేసి కొంటే.. కష్టాలే మిగిలాయి! రూ. 2.5 లక్షల ఈ-రిక్షాను తగులబెట్టిన మహిళ!

by Ramesh Naini |

జీవనోపాధి కోసం ఎన్నో ఆశలతో కొనుగోలు చేసిన ఈ-రిక్షా మోరాయించడం, దాన్ని బాగు చేసేందుకు షోరూమ్ నిర్వాహకులు నిరాకరించడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

అప్పు చేసి కొంటే.. కష్టాలే మిగిలాయి! రూ. 2.5 లక్షల ఈ-రిక్షాను తగులబెట్టిన మహిళ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జీవనోపాధి కోసం ఎన్నో ఆశలతో కొనుగోలు చేసిన ఈ-రిక్షా మోరాయించడం, దాన్ని బాగు చేసేందుకు షోరూమ్ నిర్వాహకులు నిరాకరించడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుంది. నెలల తరబడి షోరూమ్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయి నడిరోడ్డుపై తన వాహనానికి నిప్పు పెట్టింది. సుమారు రూ. 2.5 లక్షల విలువైన వాహనం కళ్లముందే బూడిదవుతుంటే ఆ మహిళ కన్నీరుమున్నీరైంది.

అప్పు చేసి కొంటే.. కష్టాలే మిగిలాయి

శివపురి ప్రాంతానికి చెందిన గుడియా మహౌర్, ఆమె భర్త నారాయణ్ మహౌర్ రోజువారీ కూలీలు. ఆరు నెలల క్రితం అప్పు చేసి రూ. 2.5 లక్షలతో ఒక ఈ-రిక్షాను కొనుగోలు చేశారు. అయితే, ఆ సంతోషం రెండు నెలలు కూడా నిలవలేదు. వాహనంలో సాంకేతిక లోపాలు తలెత్తి అది పూర్తిగా ఆగిపోయింది. గత నాలుగు నెలలుగా ఈ-రిక్షా మరమ్మతుల కోసం షోరూమ్ చుట్టూ తిరుగుతున్నట్లు గుడియా ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాహనం పని చేయడం లేదు, దయచేసి బాగు చేయండి అని మేనేజర్‌ కాళ్లు పట్టుకుని వేడుకున్నా. కానీ వారు కనికరించలేదు. అటు పని లేక, ఇటు అప్పు తీర్చలేక నరకం అనుభవించాం. ఇక లాభం లేదనుకునే ఈ పని చేశాను’ అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.

బ్యాటరీ పేలితే గ్యారెంటీ ఉండదు

ఈ ఘటనపై షోరూమ్ ఇన్‌ఛార్జ్ శుభం శర్మ స్పందిస్తూ.. వాహనంలో తయారీ లోపమేమీ లేదని పేర్కొన్నారు. ‘ఈ-రిక్షా బ్యాటరీ పేలిపోయింది. కంపెనీ నిబంధనల ప్రకారం పేలిపోయిన బ్యాటరీలకు ఉచిత రీప్లేస్‌మెంట్ ఉండదు. కొత్త బ్యాటరీ కోసం డబ్బులు చెల్లించాలని కోరాం, అందుకు ఆమె అంగీకరించలేదు’ అని వివరించారు. బహిరంగంగా వాహనానికి నిప్పు పెట్టడంతో మార్కెట్ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి, తగులబడిన వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. రెండు వైపుల వాదనలు విని విచారణ జరుపుతామని అధికారులు వెల్లడించారు.

Next Story