ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్

by Ajay Maddhiboyina |

ఫైరింగ్ నిలిచిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో గాలించగా ఒక మహిళా మావోయిస్టు మృతదేహం లభించినట్లు ఎస్పీ చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్
X

- దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో ఎదురు కాల్పులు

- వరంగ్ జిల్లాకు చెందిన మహిళా మావోయిస్టు మృతి

- రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతిగా గుర్తింపు

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. 2026 మార్చికల్లా మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించాలనే కేంద్ర ప్రభుత్వ అజెండాలో భాగంగా గత కొన్నినెలలుగా దండకారణ్యంలో విస్తృతంగా కూబింగ్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో సోమవారం ఉదయం భద్రతాదళాల యాంటీ మావోయిస్టు ఆపరేషన్ నిర్వహిస్తుండగా నక్సలైట్లు ఎదరుపడటంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నట్లు దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)కు చెందిన భద్రతా సిబ్బంది గీడమ్, బైరామ్‌గఢ్ అడవుల మధ్య కూబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఇరువర్గాల మధ్య ఫైరింగ్ నిలిచిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో గాలించగా ఒక మహిళా మావోయిస్టు మృతదేహం లభించినట్లు ఎస్పీ చెప్పారు. మృతి చెందిన మావోయిస్టు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతిగా పోలీసులు గుర్తించారు. మావోయిస్టు స్పెషలన్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్న రేణుక.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీమ్‌లో కూడా పని చేస్తున్నారు. ఇక ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఇనాస్ రైఫిల్‌తో పాటు ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లుఎస్పీ గౌరవ్ రాయ్ పేర్కొన్నారు.

ఎవరీ రేణుక?

ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన రేణుక అలియాస్ చైతే అలియాస్ సరస్వతి స్వస్థలం వరంగల్ జిల్లా కడవెండి. న్యాయ విద్యను అభ్యసించిన రేణుక.. తిరుపతిలో లాయర్‌గా కూడా ప్రాక్టీస్ చేశారు. అంతే కాకుండా తన రచనల ద్వారా ప్రజలను చైతన్యం చేశారు. తిరుపతిలో మహిళా సంఘంలో కూడా కీలకంగా పని చేశారు. అదే సమయంలో మావోయిస్టు పార్టీలో పని చేయడానికి అజ్ఞాతంలోకి వెళ్లారు. 35 ఏళ్లుగా మావోయిస్టు పార్టీల్లో వివిధ హోదాల్లో పని చేసిన రేణుక.. ప్రస్తుతం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రేణుక తండ్రి సోమయ్య ఉపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ చేశారు. ఇక రేణుకకు ఇద్దరు సోదరులు కాగా.. ఒక సోదరుడు గుమ్మడవెల్లి రాజశేఖర్ ప్రస్తుతం న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆయన ఒక స్వచ్ఛంద సంస్థకు లీగల్ అడ్వైజర్‌గా కూడా ఉన్నట్లు తెలిసింది. మరో సోదరుడు గుమ్మడవెల్లి వెంకటకిషన్ ప్రసాద్ అలియాస్ గుడ్సా ఊసెండి గతంలో మావోయిస్టు అగ్రనేతగా పని చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల కొన్నేళ్ల క్రితమే లొంగిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో జర్నలిస్టుగా పని చేస్తున్నట్లు తెలిసింది. కాగా రేణుక అలియాస్ సరస్వతిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.

Next Story