- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Compensation: బస్సు ప్రమాదంలో మహిళ మృతి.. రూ.9 కోట్ల నష్ట పరిహారం చెల్లించాల్సిందే!

దిశ,వెబ్‌డెస్క్: ఆర్టీసీ (RTC) బస్సు ప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబం కోర్టుకెక్కగా.. వారికి నష్ట పరిహారంగా ఏకంగా రూ.9 కోట్లకు పైగా చెల్లించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆర్టీసీని ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే?
ఏపీకి చెందిన లక్ష్మి నాగళ్ల అనే మహిళ అమెరికాలో (USA) కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ (Masters in Computer science) చేసి అక్కడే జాబ్ చేస్తున్నారు. ఆమెకు అమెరికా పౌరసత్వం (US Citizenship) సైతం ఉంది. అయితే, 2009 జూన్ 13న కారులో తన భర్త, ఇద్దరు కుమార్తెలతో కలిసి అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళుతుండగా.. ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మి మృతిచెందారు. దీంతో ఆమె భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల కోర్టును ఆశ్రయించాడు.
తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి అక్కడే జాబ్ చేస్తోందని, అమెరికా శాశ్వత నివాసిగా ఉందని తెలిపాడు. ఆమె నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నట్లు చెప్పాడు. ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల మేర పరిహారం ఇప్పించాలంటూ శ్యాంప్రసాద్ సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న ట్రైబ్యునల్ 2014లో మృతురాలి కుటుంబానికి రూ.8.05 కోట్లు చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది.
అయితే, ఈ తీర్పును సవాలు చేస్తూ ఆర్టీసీ (APSRTC) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, రూ.5.75 కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో తమకు అన్యాయం జరుగుతోందంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లాడు. పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు మృతురాలి కుటుంబానికి రూ.9,64,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజయ్‌కరోల్, జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.