యూట్యూబ్ చూస్తూ కాన్పు చేసిన అత్త.. కోడలు మృతి!

by Naga Rani Yarlagadda |

సోషల్ మీడియా చూసి సొంత వైద్యం చేసుకోవడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే మరో ఘోర ఉదంతం తమిళనాడులో వెలుగుచూసింది.

యూట్యూబ్ చూస్తూ కాన్పు చేసిన అత్త.. కోడలు మృతి!
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా చూసి సొంత వైద్యం చేసుకోవడం ఎంత ప్రమాదకరమో హెచ్చరించే మరో ఘోర ఉదంతం తమిళనాడులో వెలుగుచూసింది. ఆస్పత్రికి వెళ్లకుండా.. కేవలం యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఇంట్లోనే కోడలికి నార్మల్ డెలివరీ చేసేందుకు అత్త ప్రయత్నించగా.. ఆమెకు తీవ్ర రక్తస్రావమై మరణించింది. ఈ ఘటన తిరుప్పూర్ జిల్లా ఉతుకులి సమీపంలో పుంజై తలవాయిపాళ్యంలో జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న శశికళ (32)ను ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

మృతురాలి భర్త కులందైసామి తెలిపిన వివరాల ప్రకారం.. శశికళతో 2019లో పెళ్లయింది. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్. 2020లో సిజేరియన్ ద్వారా తొలికాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఆ సమయంలో తీవ్రమైన నడుమునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆ చేదు అనుభవం మనసులో బలంగా నాటుకుపోవడంతో.. ఈసారి నార్మల్ డెలివరీ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రెండోసారి గర్భందాల్చిన శశికళ.. ఒక్కసారి కూడా ఆస్పత్రి మెట్లు ఎక్కలేదు. భర్త, కుటుంబీకులు ఎంత బ్రతిమాలినా ఆస్పత్రికి వెళ్లేది లేదని మొండికేసింది. నెలలు నిండేకొద్దీ యూట్యూబ్ వీడియోలు చూస్తూ.. ఇంట్లోనే నార్మల్ డెలివరీ అయ్యేలా ఏర్పాట్లు చేసుకుంది.

కోమాలోకి వెళ్లిన బాధితురాలు

జూన్ 23వ తేదీ రాత్రి శశికళకు అకస్మాత్తుగా ప్రసవ వేదనలు ప్రారంభమవడంతో, యూట్యూబ్ సూచనలను అనుసరిస్తూ అత్త సహాయంతో జూన్ 24 ఉదయం 5:42 గంటలకు ఆమె ఇంట్లోనే రెండో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. పాప పుట్టిన కొన్ని నిమిషాల్లోనే శశికళకు విపరీతంగా రక్తస్రావం కావడం మొదలైంది. పరిస్థితి విషమించడంతో ఆమె అక్కడికక్కడే కోమాలోకి వెళ్లిపోయింది. కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పెరుందురై ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కోయంబత్తూరులోని రాయల్ కేర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయితే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో ఆదివారం (జూన్ 28) ఉదయం 10 గంటల ప్రాంతంలో శశికళ మరణించింది.

శశికళ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే.. కున్నత్తూరు ప్రాంతీయ వైద్యాధికారి నిత్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉతుకులి పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ మరణించడంతో ఈ కేసును మరణ దర్యాప్తు (Death Investigation) కేసుగా మార్చారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి వైద్య పర్యవేక్షణ లేకుండా ఇంట్లోనే కాన్పు జరగడంపై పోలీసులు కుటుంబ సభ్యులను, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా విచారిస్తున్నారు. కాగా.. నవజాత శిశువు (ఆడపాప) క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

Next Story