ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం.. నాగలి పట్టి దుక్కి దున్నిన వైనం

by Jakkula.Mamatha |

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక రైతు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ, భూమాతకు, ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని కోరుకునే పవిత్రమైన రోజు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొన్నం.. నాగలి పట్టి దుక్కి దున్నిన వైనం
X

దిశ, కోహెడ: ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక రైతు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ, భూమాతకు, ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని కోరుకునే పవిత్రమైన రోజు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు చెప్పారు. ఆ అన్నాన్ని పండించే రైతే ఈ దేశానికి వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే అత్యంత ప్రాధాన్యం గా తీసుకుని అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం సాగునీటి వసతుల మెరుగుదల, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులందరూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలి. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలి. నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రకృతి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలి. ఈ పవిత్రమైన రోజున భూమాత ఆశీర్వాదంతో ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండాలి ఈ ఖరీఫ్ సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలు పండాలి ఆర్థికంగా మంచి రాబడి రావాలి ఈ సీజన్ లో అన్ని పంటలు క్రిమి కీటకాలు లేకుండా ఆర్థికంగా మంచి రాబడి వచ్చేలా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బోయిని నిర్మలా జయరాజ్, మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, బండారి లక్ష్మి బాలరాజ్, మంద ధర్మయ్య, చేపూరి శ్రీశైలం, బందెల బాలకిషన్, వివిధ గ్రామాల సర్పంచులు , వ్యవసాయ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story