- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం.. 60 రోజుల్లో పూణె కోర్టు సంచలన తీర్పు
మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జరిగిన అత్యంత అమానుష ఘటనలో స్పెషల్ కోర్టు రికార్డు సమయంలో చారిత్రాత్మక తీర్పునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జరిగిన అత్యంత అమానుష ఘటనలో స్పెషల్ కోర్టు రికార్డు సమయంలో చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, ఆపై దారుణంగా హత్య చేసిన 65 ఏళ్ల వృద్ధుడికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. నేరం జరిగిన నెలరోజుల్లోనే విచారణ పూర్తి చేసి.. 60 రోజుల్లోనే నిందితుడికి శిక్ష విధించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం చివరిగా నిందితుడే బాలికతో కలిసి కనిపించాడన్న ప్రాసిక్యూషన్ వాదనలతో కోర్టు ఏకీభవించి, అతడిని దోషిగా తేల్చింది.
పశువుల పాకలో.. పాపపై పశువులా..
మే1, 2026న పూణే జిల్లా నస్రాపూర్ గ్రామంలో ఈ ఘోర కలి జరిగింది. చిన్నారి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా.. అదే సమయంలో నిందితుడు పసికందుకు తినుబండారాల ఆశచూపి పక్కనే ఉన్న పశువుల పాకలోకి తీసుకెళ్లి.. ఘాతుకానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగకుండా చిన్నారిని చంపేశాడు. పాప కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల వెతకగా పశువుల పాకలో మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై నస్రాపూర్ సహా పూణే వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. నేరం జరిగి, వెలుగులోకి వచ్చినరోజునే నిందితుడిని అరెస్ట్ చేశారు. కేవలం 16 రోజుల్లోనే 1200 పేజీల భారీ ఛార్జ్ షీట్ ను కోర్టులో సమర్పించగా.. మే 28న కోర్టు చార్జీలను నమోదు చేసింది. జూన్ 20 నాటికి ఇరుపక్షాల తుదివాదనలు పూర్తవ్వగా.. 25న నిందితుడిని దోషిగా నిర్ధారించింది. తాజాగా నిందితుడికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు నిందితుడిపై కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను.. జైలు నుంచి బయటకు వెళ్లాక ఎలాంటి మార్పుగానీ, పశ్చా్త్తాపం గానీ లేవని పేర్కొంది. ఇలాంటి వ్యక్తి సమాజానికి ఎప్పటికీ ప్రమాదకరమేనని అభిప్రాయపడింది.
సుప్రియా సూలే హర్షం
కోర్టు తీర్పుపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (SP) ఎంపీ సుప్రియా సూలే హర్షం వ్యక్తం చేశారు. "చివరకు ఆ చిన్నారికి, ఆమె కుటుంబానికి న్యాయం జరిగింది. ఈ తీర్పును మేమంతా స్వాగతిస్తున్నాము. ఇలాంటి కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి త్వరితగతిన శిక్షలు పడేలా చేయాలనే మా డిమాండ్ నెరవేరింది. కేవలం 16 రోజుల్లోనే పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన దర్యాప్తు అధికారులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు" అని ఆమె X వేదికగా పేర్కొన్నారు.






