డోంట్ వర్రీ.. యుద్ధం వేళ భారత్‍కు రష్యా కీలక భరోసా

by Prasad Jukanti |

మధ్యప్రాచ్య దేశాల్లో యుద్ధం నేపథ్యంలో చమురు విషయంలో భారత్‌కు రష్యా భరోసా ఇచ్చింది.

డోంట్ వర్రీ.. యుద్ధం వేళ భారత్‍కు రష్యా కీలక భరోసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్ హర్మూజ్ జలసంధిని మూసివేయడం ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ చమురు వినియోగంలో 20 శాతం హర్మూజ్ జల సంధి ద్వారానే వెళ్తుంది. ఈ పరిణామం ఇంధన సంక్షోభమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేయసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. ఓ వైపు హార్మూజ్ మార్గం క్లోజ్, మరో వైపు గల్ఫ్ దేశాల్లోని ఇంధన కేంద్రాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఈ ఉద్రిక్తతలు భారత్‍లోని (India) చమురు నిల్వలపై టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పట్ల రష్యా (Russia) తన స్నేహాన్ని మరోసారి ప్రదర్శించింది. యుద్ధం ముదిరి గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు సరఫరాలో (Crude oil supply) ఆటంకాలు ఎదురైతే భారత్ కు అవసరమైన అదనపు ఇంధనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా భరోసా ఇచ్చింది.

అమెరికా ఆంక్షలు:

భారత్ కు చమురు సరఫరాకు రష్యా ముందుకు వచ్చినా దిగుమతి విషయంలో అమెరికా ఆంక్షలు ఉన్నాయి. భారత- యుఎస్ మధ్య మధ్యవర్తి టారిఫ్ ఒప్పందం ప్రకారం రష్యా మీద ఆధారాన్ని తగ్గించడం ఒక షరతుగా ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోకుండా అమెరికా భారత్ కు షరతులు విధించింది. ఈ పరిణామాలతో దాదాపు మూడు సంవత్సరాలుగా స్థిరమైన పెరుగుదల తర్వాత నవంబర్ 2025లో భారతదేశం రష్యన్ ముడి చమురు దిగుమతులు గణనీయంగా తగ్గించింది. ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధవాతావరణం కారణంగా అవసరం ఏర్పడితే రష్యా నుంచి చమురును భారత్ ఏ మేరకు దిగుమతి చేసుకుంటుంది అనేది ఆసక్తికర అంశం.

6-8 వారాలకు సరిపడ నిల్వలు:

ప్రస్తుతం యుద్ధం కారణంగా స్వల్పకాలికంగా ఇంధనాల సరఫరాలో ఆటంకాలేర్పడినా భారత్‍కు ఇబ్బందేమీ లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపారు. మన దగ్గర 6-8 వారాల డిమాండ్ కు సరిపడే పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని వివరించాయి.

Next Story