Madhya Pradesh: బలవంతపు మతమార్పిడికి పాల్పడితే మరణశిక్షే..!

by Shamantha N |   (  Updated:2025-03-08 16:10:11  IST  )

బలవంతపు మత మార్పిడిపై మధ్యప్రదేశ్‌ సీఎం(Madhya Pradesh CM) మోహన్ యాదవ్ (Mohan Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Madhya Pradesh: బలవంతపు మతమార్పిడికి పాల్పడితే మరణశిక్షే..!
X

దిశ, నేషనల్ బ్యూరో: బలవంతపు మత మార్పిడిపై మధ్యప్రదేశ్‌ సీఎం(Madhya Pradesh CM) మోహన్ యాదవ్ (Mohan Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడిని సహించబోమన్న ఆయన.. నిందితులకు మరణశిక్ష పడేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీనికోసం, తమ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..‘మా అమాయక కుమార్తెలపై దారుణాలకు పాల్పడే వారిపై మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని బలవంతం చేసే వారిని మేం వదిలిపెట్టబోయేది లేదు. అలాంటి వారిని జీవించడానికి అనుమతించవద్దు. మత స్వేచ్ఛ చట్టం ద్వారా బలవంతపు మత మార్పిడులు చేసే వారికి మరణశిక్ష విధించే నిబంధన తెచ్చేందుకు మేం కృషి చేస్తున్నాం’ అని అన్నారు.

కాంగ్రెస్ విమర్శలు

కాగా, ‘లవ్ జిహాద్‌’గా(love jihad) పేర్కొనే బలవంతపు మత మార్పిడులపై బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా 2021 మార్చి 8న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ చట్టాన్ని ఆమోదించారు. అక్రమ మత మార్పిడులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించే నిబంధన ఈ చట్టంలో ఉంది. అలాగే ఈ చట్టాన్ని ఉల్లంఘించి జరిగే ఏ వివాహం కూడా చెల్లుబాటు కాదు. మరోవైపు, ఈ చర్యను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. కాషాయ పార్టీ ఒక నిర్దిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఆ పార్టీ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుందన్న్నారు. ఆయన మాట్లాడుతూ.. "భోపాల్‌లో మూడు రోజులుగా ఒక అమ్మాయి తప్పిపోయింది. ఇప్పటివరకు ఆమె ఆచూకీ కనుక్కోలేదు కానీ.. ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఎల్లప్పుడూ వారి అలవాటు" అని మసూద్ అన్నారు

Read More ....

J&K: జమ్ముకశ్మీర్ లో తప్పిపోయిన ముగ్గురి కథ విషాదాంతం


Next Story