Marco Rubio: విద్యార్థుల వీసాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు

by Shamantha N |

విద్యార్థి వీసాలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూనే ఉంటామని మార్కో రూబియో (Marco Rubio) స్పష్టం చేశారు.

Marco Rubio: విద్యార్థుల వీసాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: విద్యార్థి వీసాలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూనే ఉంటామని మార్కో రూబియో (Marco Rubio) స్పష్టం చేశారు. సెనెట్‌లో డెమోక్రట్లతో జరిగిన వాడీవేడి చర్చలో ఆయన విద్యార్థుల వీసా అంశంపై మాట్లాడారు. అమెరికా విదేశాంగ విధాన ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే కార్యకలాపాలను తొలగించడానికి అనుమతించే చట్టం ప్రకారం.. విదేశీయుల వీసాలను ఉప సంహరించుకుంటామని ఆయన పేర్కొన్నారు. వీసా అనేది హక్కు కాదు. ఒక సౌకర్యం మాత్రమే అని స్పష్టంచేశారు. ‘‘ఇలాంటివి మేం మరిన్ని చేయబోతున్నాం. ఇక్కడికి అతిథులుగా వచ్చి.. మన ఉన్నత విద్యా సౌకర్యాలకు అంతరాయం కలిగిస్తున్న వ్యక్తుల వీసాలను రద్దు చేస్తూనే ఉంటాం’’ అని ఆయన చెప్పారు.

డెమోక్రటిక్ సభ్యుల విమర్శలు

అమెరికాలో రాజ్యంగ రక్షణ అయిన వాక్‌ స్వాతంత్ర్యాన్ని రూబియో ఉల్లంఘిస్తున్నారని, ఇజ్రాయెల్‌ను విమర్శించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డెమోక్రటిక్‌ సభ్యులు ఆరోపించారు. వీటిపై విదేశాంగ మంత్రి రూబియో స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇది వాక్‌ స్వాతంత్ర్యపు హక్కును కాలరాయడమేనని డెమోక్రటిక్‌ నేత వాన్‌ హొలెన్‌ రూబియోపై మండిపడ్డారు. దీనికి రూబియో స్పందిస్తూ.. లైబ్రరీలను స్వాధీనం చేసుకొని.. భవనాలను తగలబెట్టడానికి ప్రయత్నించే విద్యార్థులనే తాను లక్ష్యంగా చేసుకున్నట్లు వివరించారు.

Next Story