గెలుపెవరిది? రేపు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-02-07 14:39:56  IST  )

ఢిల్లీలో తాము దాదాపు 50 సీట్లు గెలుస్తామని ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవ్ అంచనా వేశారు. ఢిల్లీ ప్రజలను ఆప్ నుంచి విముక్తి చేయబోతున్నామని ఆయన చెప్పారు.

గెలుపెవరిది? రేపు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు
X

- బీజేపీ, ఆప్ మధ్యే ప్రధాన పోటీ

- బీజేపీ వైపు మొగ్గు చూపిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్

- తప్పక గెలుస్తామంటున్న ఆప్

- కాంగ్రెస్ ఖాతా తెరిచేనా?

- 699 మంది అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే

- అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల కమిషన్

- ఉదయం 8 గంటలకే ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవ్వాళ జరగనుంది. ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్‌ సహా పలు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 699 మంది ఎన్నికల బరిలో దిగారు. ఢిల్లీలోని 70 స్థానాలకు ఫిబ్రవరి 5న జరిగిన పోలింగ్‌లో 60.42 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. ఢిల్లీలో ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్యే పోటీ నడిచిందని పలు సర్వేలు వెల్లడించాయి. వరుసగా నాలుగో సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆప్ నాయకులు చెబుతున్నారు. ఇక 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం చేపట్టనున్నామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయిన కాంగ్రెస్ మాత్రం.. ఈ సారి ఖాతా తెరుస్తామని చెబుతోంది. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువరించారు. మెజార్టీ సర్వే సంస్థలు బీజేపీకే పట్టం కట్టాయి. ఢిల్లీలో తాము దాదాపు 50 సీట్లు గెలుస్తామని ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవ్ అంచనా వేశారు. ఢిల్లీ ప్రజలను ఆప్ నుంచి విముక్తి చేయబోతున్నామని ఆయన చెప్పారు. అయితే ఎగ్జిట్ పోల్స్‌ను తాము నమ్మడం లేదని, మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని అర్వింద్ కేజ్రివాల్ చెబుతున్నారు.

కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) అలిస్ వాజ్ తెలిపారు. సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు, సహాయక సిబ్బంది మొత్తం కలిపి 5 వేల మందిని నియమించామని తెలిపారు. కౌంటింగ్ సమయంలో ప్రతీ నియోజకవర్గం నుంచి ర్యాండమ్‌గా ఐదు వీవీ పాట్లను లెక్కించి, ఈవీఎం ఓట్లతో కంపేర్ చేస్తామని అలిస్ వాజ్ పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల లోపు అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన తెలిపారు.

ఈ నియోజకవర్గాలపై దృష్టి..

ఢిల్లీ అసెంబ్లీ పరిధిలోని ఐదు నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్‌కు వ్యతిరేకంగా అంచనాలు రావడంతో ఈ ఐదు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది. న్యూఢిల్లీ నుంచి మాజీ సీఎం అర్వింద్ కేజ్రివాల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుంచి సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. 2013 నుంచి కేజ్రివాల్‌కు ఇక్కడ ఓటమే లేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ తరపున బలమైన అభ్యర్థులు ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఇక కాల్కాజీ నుంచి ముఖ్యమంత్రి ఆతిషి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆల్కా లాంబాను బరిలో దించింది. రెండు పార్టీలు మహిళా అభ్యర్థులనే పోటీలో నిలబెట్టింది. అయితే బీజేపీ మాత్రం వివాదాస్పద నేత రమేశ్ బిదూరికి టికెట్ ఇచ్చింది.

ఇక జంగ్‌పురా నుంచి మనీశ్ సిసోడియా బరిలో ఉన్నారు. ఆప్‌కు ఈ నియోజకవర్గంలో బలమైన మద్దతుదారులు ఉన్నారు. దీంతో సిసోడియా తొలి సారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున తార్వీందర్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఫర్హాద్ సూరి పోటీ చేశారు. మరి ఈ సారి ఇక్కడి ఓటర్లు సిసోడియాను గెలిపిస్తారా లేదా అనేది చూడాలి. ఓక్లా నియోజకవర్గం నుంచి ఆప్ తరపున అమానుతుల్లా ఖాన్ వరుసగా మూడో సారి బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరపున అరీబా ఖాన్, బీజేపీ నుంచి ఫిర్దౌస్ ఆలమ్, మజ్లిస్ పార్టీ నుంచి షిఫా ఉర్ రెహ్మాన్ పోటీలో ఉన్నారు. కాగా, ముస్లిం ఓటర్లు అధికంగా ఉండే ఓక్లాలో మజ్లిస్ కూడా పోటీ చేయడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది. ఆప్ సీనియర్ నేత సోమనాథ్ భారతి పోటీ చేస్తున్న మాల్వియా నగర్‌ రిజల్ట్‌పై కూడా అందరి దృష్టి ఉంది. గతంలో రెండు సార్లు సోమనాథ్ ఇక్కడి నుంచి గెలిచారు. ఆప్‌కు ఇక్కడ బలం ఎక్కువగా ఉంది. అయితే బీజేపీ నుంచి సతీశ్ ఉపాధ్యాయ ఈ సారి గట్టి పోటీ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ తరపున జితేంద్ర కుమార్ పోటీలో ఉన్నారు.

Next Story