భారత అక్రమ వలసదారులను ఆ దేశానికి తరలిస్తున్న అమెరికా.. ఎందుకంటే?

by Yella Dhawani Reddy |

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తోంది.

భారత అక్రమ వలసదారులను ఆ దేశానికి తరలిస్తున్న అమెరికా.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Trump) బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని అమెరికా నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాల్లోని అక్రమ వలసదారులకు తిరిగి వారి దేశాలకు పంపిస్తున్నారు. ఇటీవల కొందరు భారతీయులను పంపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారత్‌ అక్రమ వలసదారులను కోస్టారికాకు తరలిస్తున్నట్లు ఆ దేశం సోమవారం ప్రకటించింది.

ఇందులో భాగంగా 200 మంది వలసదారులతో బుధవారం విమానం తమ దేశానికి చేరబోతున్నట్లు కోస్టారికా దేశాధ్యక్ష కార్యాలయం తెలిపింది. వీరంతా మధ్య ఆసియా, భారత్‌కు చెందినవారని పేర్కొంది. వీరందరినీ కమర్షియల్‌ ఫ్లైట్‌లో పనామాకు తరలిస్తున్నట్లు తెలిపింది. అనంతరం వలసదారుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరానికి తరలించనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ మొత్తానికి అమెరికానే సొమ్ములు చెల్లిస్తుందని, దీనిని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ సంస్థ పర్యవేక్షించనుందని కార్యాలయం తెలిపింది.

ఇటీవల అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో లాటిన్‌ అమెరికాలో పర్యటించారు. ఈసందర్భంగా గ్వాటమాల, పనామా దేశాలు కూడా ఇలాంటి ఒప్పందాలే చేసుకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పనామాకు తొలి బ్యాచ్‌ కింద 119 మంది చైనా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ వలసదారులను తరలించింది. అయితే, గ్వాటమాలకు మాత్రం ఇంకా అమెరికా నుంచి వలసదారులను తరలించలేదు. కాగా, అమెరికా నుంచి భారత్‌కు ఇప్పటికే మూడు విమానాల్లో అక్రమ వలసదారులు వచ్చారు. తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5న , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు.

తాజాగా వచ్చినవారిలో 44 మంది హర్యానా, 33 మంది గుజరాత్‌, 31 మంది పంజాబ్‌ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మిగిలినవారు యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వారు. వెనక్కివచ్చిన వారి వివరాలను అధికారులు పరిశీలించిన తర్వాత వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశారు.

Next Story