ఆపరేషన్ సిందూర్ అర్థరాత్రే ఎందుకు?.. రెండు ప్రధాన కారణాలు వెల్లడించిన సీడీఎస్ జనరల్ అనిల్

by Naga Rani Yarlagadda |

తాజాగా.. ఆపరేషన్ సిందూర్ ను అర్థరాత్రి నిర్వహించడానికి గల కారణాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు.

ఆపరేషన్ సిందూర్ అర్థరాత్రే ఎందుకు?.. రెండు ప్రధాన కారణాలు వెల్లడించిన సీడీఎస్ జనరల్ అనిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పహల్గామ్ లో ఉగ్రవాదులు (Pahalgam Terror Attack) సృష్టించిన మారణకాండకు.. భారత ఆర్మీ (Indian Army) ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పేరుతో ఎదురుదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో చేసిన దాడుల్లో అనేకమంది ఉగ్రవాదులు మరణించినట్లు కూడా తెలిపింది. అయితే తాజాగా.. ఆపరేషన్ సిందూర్ ను అర్థరాత్రి నిర్వహించడానికి గల కారణాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. రాంచీలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే 7వ తేదీ అర్థరాత్రి 1 గంట సమయంలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ ను ఉద్దేశపూర్వకంగానే అమలు చేశామన్నారు.

నిజానికి అర్థరాత్రి వేళ దాడులు చేయడం చాలా కష్టం. కఠిక చీకటిలో ఉపగ్రహ చిత్రాలు, ఛాయాచిత్రాలను పొందడం, ఆధారాలను సేకరించడం చాలా కష్టం. అయినప్పటికీ ఆ సమయంలో దాడి చేయడానికి రెండు ముఖ్య కారణాలున్నాయన్నారు. ఒకటి.. సాయుధ దళాలకు తమ శక్తి సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉందని, రాత్రి వేళల్లోనూ ఛాయా చిత్రాలను సంగ్రహించే, నష్టాన్ని అంచనా వేయగల సామర్థ్యం ఉందన్నారు. రెండవది పౌరులెవరికీ హాని జరగకుండా, పౌరుల ప్రాణనష్టాన్ని నివారించాలనుకోవడమేనని వివరించారు.

తొలుత ఉదయం 5.30- 6 గంటల సమయంలో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాలని భావించామని, కానీ.. ఆ సమయంలో అజాన్ (మొదటి ప్రార్థన) జరుగుతుందని తెలిపారు. బహల్పూర్, మురిద్కేలలో ఆ సమయంలో చాలా మంది పౌరులు ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉందని, అప్పుడు దాడులు జరిపితే పౌరుల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని గ్రహించి.. దానిని నివారించేందుకు అర్థరాత్రి సమయంలో దాడులు చేశామని అనిల్ చౌహాన్ వెల్లడించారు.

Next Story