- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి ఆర్థిక ఒప్పందం కాదు.. వరకట్న వేధింపులపై సుప్రీం సీరియస్
వరకట్న వేధింపులు, హత్యలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్ : వరకట్న హత్యలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యువకులు.. అమ్మాయిలను పెళ్లి చేసుకుని, తీసుకున్న కట్నకానుకలు చాలదన్నట్లు మళ్లీ కట్నం తీసుకురావాలని భార్యల్ని వేధించడం, వారి కుటుంబాలను అవమానించడం వంటి ఘటనలపై తీవ్ర అసంతృప్తి చెందింది. ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. చత్తీస్ ఘడ్ లో వరకట్న వేధింపులు, హత్యకేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న ఈ వ్యాఖ్యలు చేశారు. అధిక కట్నం కోసం వధువు కుటుంబాన్ని బిచ్చగాళ్లు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నవారి కుటుంబాల్లోనూ వరకట్న వేధింపులు పెరగడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లో పెళ్లయిన మూడేళ్లకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయిన కేసును [సుచిత కేసరి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్] విచారించిన కోర్టు, నిందితులకు గట్టి హెచ్చరిక లాంటి సందేశం వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ, భర్త కుటుంబ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుబట్టింది. సమాజంలో ఇంకా కొనసాగుతున్న ఈ దురాచారాన్ని ప్రశ్నిస్తూ జస్టిస్ నాగరత్న భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.
అసలేం జరిగిందంటే..
2010లో ఛత్తీస్‌గఢ్‌లో వివాహమైన మూడేళ్లకే ఓ మహిళ తన అత్తవారింట్లో ఉరివేసుకుని మరణించింది. భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం, కారు కోసం సదరు మహిళను నిరంతరం శారీరకంగా, మానసికంగా వేధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వివాహమైన ఏడేళ్ల లోపు అసాధారణ పరిస్థితుల్లో మరణం సంభవించడంతో, ఇది వరకట్న మరణమేనని ట్రయల్ కోర్టు నిర్ధారించింది. మరణానికి కొద్దిరోజుల ముందు కూడా డబ్బుల కోసం వేధించినట్లు బాధిత కుటుంబ సభ్యులు సాక్ష్యాధారాలు సమర్పించారు. ఈ కేసులో భర్త కుటుంబ సభ్యులకు సెక్షన్ 304B (వరకట్న మరణం), 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 498A (మహిళను వేధించడం) కింద కోర్టు శిక్ష విధించింది. దీనిని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కూడా సమర్థించింది.
భిక్షగాళ్లంటూ అవమానిస్తారా?
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ భర్త తమ్ముడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై కేవలం సెక్షన్ 498A (వేధింపులు) మాత్రమే ఉందని, అది కూడా వర్తించదని అతని తరపు లాయర్ రిషి జైస్వాల్ వాదించారు. అయితే కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. "మీపై కేవలం 498A కింద మూడేళ్ల శిక్ష మాత్రమే పడినందుకు మీరు సంతోషించాలి" అని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. పెళ్లికూతురి కుటుంబాన్ని ఆర్థికంగా వేధించే తీరును ఎండగడుతూ.. "అమ్మాయి తరపు వారు తమ కూతురిని కాపాడుకోవడానికి రూ.60 వేలు ఇస్తామని బతిమిలాడుతుంటే, మీరేమో వారిని భిక్షగాళ్లు అని పిలుస్తారా? చదువుకున్న కుటుంబాల్లో కూడా ఇలాంటి ప్రవర్తన ఆందోళనకరం" అని ధర్మాసనం మండిపడింది. ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయడంలో ఆలస్యమైందన్న డిఫెన్స్ లాయర్ వాదనను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. "ఇలాంటి కేసుల్లో కఠినమైన సందేశం వెళ్లాల్సిందే" అని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు సదరు అప్పీల్‌ను కొట్టివేసింది.






