మనం ఎందుకు విమానాలు పంపడం లేదు?

by Ajay Maddhiboyina |

యూఎస్ మిలటరీ విమానం ఎందుకు భారత గడ్డపైఅడుగు పెట్టింది. మన పౌరులకు సంకెళ్లు ఎందుకు వేశారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు.

మనం ఎందుకు విమానాలు పంపడం లేదు?
X

- మన పౌరులను గౌరవంగా వెనక్కి తెచ్చుకోవచ్చు కదా?

- కాబోయే విశ్వగురుకు ఆ మాత్రం విమానాలు లేవా?

- ఇది భారత్‌కు అవమానం

- పార్లమెంట్‌లో విపక్షాల దాడి

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను వెనక్కు తీసుకొని రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు విమానాలను పండం లేదు. మన పౌరులను గౌరవంగా వెనక్కి తీసుకొని రావడం ప్రభుత్వం బాధ్యత కాదా అని విపక్షలు పార్లమెంటులో ఆందోళన వ్యక్తం చేశాయి. అక్రమ వలసదారులను ట్రంప్ ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తోంది. భారత్‌కు చెందిన 104 మందిని మొదటి విడతలో టెక్సాస్ నుంచి మిలటరీ విమానంలో పంపింది. బుధవారం ఆ విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయ్యింది. అయితే సరైన డాక్యుమెంట్లు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిని వెనక్కి మనమే ఎందుకు తీసుకొని రాలేకపోతున్నామని విపక్షాలు ప్రశ్నించాయి. యూఎస్ మిలటరీ విమానంలో సంకెళ్లతో బంధించి వెనక్కి పంపుతుంటే ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. లోక్‌సభలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ వివరణపై టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌లు అభ్యంతరం తెలిపారు. 'ప్రపంచంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. త్వరలోనే మనం విశ్వగురు కూడా కాబోతున్నాము. మన పౌరులకు సంకెళ్లు వేసి పంపుతుంటే విశ్వగురు ఏం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలో టాప్ 10లో కూడా లేని కొలంబియా వంటి దేశం వారి పౌరులను గౌరవంగా వెనక్కి తీసుకొని వస్తుంటే.. మనం ఒక్క విమానాన్ని కూడా పంపలేదు. మనకేమీ విమానాలు కొదువ లేవు కదా' అని గోఖలే ప్రశ్నించారు. అమెరికా డిపోర్టేషన్ పాలసీలను మన విదేశాంగ మంత్రి జైశంకర్ కాపాడుతున్నట్లుగా నాకు అనిపిస్తుందని గోఖలే వ్యాఖ్యానించారు. యూఎస్ మిలటరీ విమానం ఎందుకు భారత గడ్డపైఅడుగు పెట్టింది. మన పౌరులకు సంకెళ్లు ఎందుకు వేశారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఇది భారత్‌కు అవమానం. ఇప్పటికైనా అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను గౌరవంగా వెనక్కు తీసుకొని రావాలని విపక్షలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.

Next Story