Congress: చైనా గురించి పార్లమెంటులో చర్చ జరగాలి: జైరాం రమేష్

by S Gopi |

పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో చైనాపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరిస్తారని ఆశిస్తున్నట్టుప్రకటనలో వెల్లడించింది.

Congress: చైనా గురించి పార్లమెంటులో చర్చ జరగాలి: జైరాం రమేష్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన చైనా మంత్రులతో ద్వైపాక్షిక చర్చలతో పాటు అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చైనాతో ఉన్న తీవ్ర ఉద్రిక్తతలపై ప్రతిపక్ష కాంగ్రెస్ కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే వారం జరగబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో చైనాపై చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరిస్తారని ఆశిస్తున్నట్టు మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. 1962 నాటి చైనా దాడి సమయంలో సరిహద్దు పరిస్థితులపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు ఇప్పుడెందుకు జరగొద్దని కాంగ్రెస్ స్వరం పెంచుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌ఛార్జ్ కమ్యూనికేషన్స్ జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఉత్పాదక శక్తిగా చైనా ఎదగడం, రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆ దేశం నుంచి ఉత్పన్నమయ్యే భద్రత, ఆర్థిక సవాళ్లపై జాతీయ ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండటం చాలా అవసరమని అన్నారు.

అంతకుముందు సోమవారం చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో జరిగిన సమావేశంలో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. గత అక్టోబర్‌లో కజాన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశం తర్వాత భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధం క్రమంగా మెరుగుపడుతోందని, ఈ సంబంధాలు పరస్పరం ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుందని చెప్పినట్టు జైరామ్ రమేష్ ప్రస్తావించారు. ప్రధాని జిన్‌పింగ్‌తో చర్చల తర్వాత కూడా ద్వైపాక్షిక సంబంధాలలో ఇటీవలి పరిణామాలను విదేశాంగ మంత్రికి గుర్తు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్తాన్‌కు పూర్తి మద్దతు ఇవ్వడం, యుద్ధవిమానం, జే-10సీ ఫైటర్, పీఎల్-15ఈ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి, వివిధ రకాల డ్రోన్‌ల వంటి ఆయుధాలను అందించడం ద్వారా మనతో సంబంధాలపై సందేహాలు ఏర్పడుతున్నాయని జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ముగ్గురు ప్రత్యర్థులతో పోరాడిందని, అందులో పాకిస్తాన్‌కు లైవ్ ఇన్‌పుట్‌లు అంటే భారత సైనిక కార్యకలాపాలపై రియల్ టైమ్ ఇంటెలిజెన్స్‌ను అందించిన చైనా కూడా ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్ సమీప భవిష్యత్తులో చైనీస్ జే-35 స్టెల్త్ ఫైటర్‌లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం అరుదైన-భూమి ఖనిజాలు, ప్రత్యేక ఎరువులు, టన్నెల్-బోరింగ్ యంత్రాలు వంటి కీలకమైన పదార్థాల విషయంలో చైనా భారత్‌కు ఎగుమతి చేయడంలో పరిమితం చేసిందని తెలిపారు.

ఈ పరిణామాల మధ్య విదేశాంగ మంత్రి, ప్రధాన మంత్రి మోడీ ప్రజల విశ్వాసం కోసం పార్లమెంటులో చైనాపై సమగ్రమైన చర్చ ఎప్పుడు నిర్వహించబోతున్నారని ఆయన ప్రశ్నించారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలోనైనా ప్రధాన మంత్రి చర్చకు అంగీకరిస్తారని, ఐదేళ్ల కరువును తొలగిస్తారని కాంగ్రెస్ ఆశిస్తోందని జైరాం రమేష్ వెల్లడించారు.

Next Story