వాట్సప్‌ ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌.. కేంద్రం ఘాటు హెచ్చరిక

by Prasad Jukanti |   (  Updated:2026-07-01 11:24:51  IST  )

వాట్సాప్ కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం ఘాటుగా స్పందించింది. మోసాలు పెరిగితే టెలిగ్రామ్ తరహాలోనే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

వాట్సప్‌ ‘యూజర్‌నేమ్‌’ ఫీచర్‌.. కేంద్రం ఘాటు హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ నంబర్ షేర్ చేయకుండా కేవలం యూజర్‌నేమ్‌తోనే చాట్ చేసుకునేలా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తీసుకురాబోతున్న 'యూజర్ నేమ్' ఫీచర్‍పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనివల్ల ప్రైవసీ సమస్యలు ఉత్పన్నం అవుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఆన్‌లైన్ మోసాలు, నకిలీ అకౌంట్ల ముప్పు మరింత పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ సంస్థకు అత్యంత ఘాటుగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఫీచర్‌పై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కొత్త ఫీచర్ల వల్ల ఆన్‌లైన్ మోసాలు పెరిగితే దానికి సదరు మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసినట్లు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అంతే కాదు ఈ విషయంలో చింతించాల్సింది వాట్సాప్ సంస్థే తప్ప మేము కాదు అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు ఈ కథనం స్పష్టం చేసింది.

టెలిగ్రామ్‍ తరహా చర్యలు తప్పవు:

ఎడిట్ చేసిన మెసేజ్‌లు, నకిలీ గ్రూపులు, యూజర్‌నేమ్‌ల ద్వారా ఎవరైనా మోసాలకు లేదా తప్పుడు సమాచార వ్యాప్తికి పాల్పడితే.. గతంలో నీట్ (NEET) పరీక్ష వివాదం సమయంలో 'టెలిగ్రామ్' (Telegram) యాప్‌పై తీసుకున్న తరహాలోనే కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. తమ ప్లాట్‌ఫారమ్ నిర్మాణాన్ని (Architecture) ఎవరూ దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంస్థలదేనని, ఒకవేళ పొరపాట్లు జరిగితే ప్రభుత్వ స్పందన అంతే సీరియస్ గా ఉంటుందని తేల్చి చెప్పారు.

వాట్సాప్ సమర్థన!

అయితే ఈ ఫీచర్ విషయంలో ప్రభుత్వ ఆందోళనపై వాట్సాప్ ప్రతినిధి స్పందించినట్లు ఈ కథనం స్పష్టం చేసింది. తాము తీసుకువచ్చిన ఈ ఫీచర్ భద్రతను బలహీనపరచడానికి కాదని వినియోగదారుల వ్యక్తిగత ప్రైవసీని పెంచడానికే తెస్తున్నామని తెలిపినట్లు పే్రకొంది. నకిలీ అకౌంట్లను గుర్తించే వ్యవస్థలు, ఒక అకౌంట్ నుండి యూజర్‌నేమ్ ద్వారా ఎంతమంది కొత్తవారిని సంప్రదించవచ్చనే దానిపై పరిమితులు, సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థల పేర్లను ముందే రిజర్వ్ చేయడం వంటి అనేక రక్షణ వలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే తాము కంపెనీల హామీలను కాకుండా, క్షేత్ర స్థాయిలో వచ్చే ఫలితాల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని , కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపినట్లు ఈ కథనం స్పష్టం చేసింది.

ప్రముఖుల పేర్లు ముందే రిజర్వ్:

అయితే అందరినీ ఊరిస్తున్న ఈ ఫీచర్‍పై ప్రముఖుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే వాట్సాప్‌లో వెరిఫైడ్ యూజర్‌నేమ్‌లతో పాటు అచ్చం అలాగే వినిపించే అన్‌వెరిఫైడ్ నకిలీ యూజర్‌నేమ్‌లు కూడా వచ్చేస్తాయని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు వినియోగదారులు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, కునాల్ షా వంటి ప్రముఖుల పేర్లను పోలిన హ్యాండిల్స్‌ను (Usernames) రిజర్వ్ చేసుకోగలిగారని ఆరోపిస్తున్నారు. మరి కొంత మంది తమ పేరును రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయగా ఇంటి పేరుతో సహా ఇతరులకు రిజర్వ్ అయిపోనట్లు చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్‌ను రోల్ అవుట్ చేసేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తుండగా ఆలోపు ఈ ఫీచర్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది వేచి చూడాలి.

Next Story